Home రాజకీయాలు అసలు జనసేన వచ్చే ఎన్నికల పోటీలో ఉంటుందా?

అసలు జనసేన వచ్చే ఎన్నికల పోటీలో ఉంటుందా?

SHARE

పవన్ కల్యాణ్ పార్టీ జనసేన విషయంలో కొత్త కొత్త సందేహాలు మొదలవుతున్నాయి. ఇప్పటికే ఈ పార్టీ ప్రారంభం అయ్యి ఐదు సంవత్సరాలు అయ్యాయి. ఐదేళ్లు పూర్తి అవుతున్న తరుణంలో ఈ పార్టీ గుర్తు తెచ్చుకుంది. ఏ రాజకీయ పార్టీ కూడా ఇలా ఎన్నికలు అయిన ఐదేళ్లకు గుర్తు తెచ్చుకుని ఉండదు. అలాంటిప్రత్యేకత పవన్ కల్యాణ్ పార్టీకే దక్కుతోంది.

ఇక ఇళ్లు అలకగానే పండగ అయిపోదు.. ఐదేళ్ల తర్వాత అయినా గుర్తు తెచ్చుకోగానే ఎన్నికల్లో గెలిచేయలేరు. ఎన్నికల్లో గెలిచే కళ వేరు. అది ఇప్పుడు జనసేనకు ఉందా అనేది సందేహంగా మారుతోంది. ప్రత్యేకించి ఆ పార్టీకి ఇప్పటి వరకూ నేతలంతా ఎవరూ లేకుండా పోయారు.

పవన్ కల్యాణ్, ఆయన వెంట కనిపించే నాదెండ్ల మనోహర్ లను పక్కన పెడితే.. జనసేన పార్టీకి ఎన్ని నియోజకవర్గాల్లో ఇన్ చార్జిలు ఉన్నారు? అనేది పెద్ద డౌట్. ఇప్పటి వరకూ పవన్ కల్యాణ్ రాష్ట్ర వ్యాప్తంగా తిరిగిందే లేదు. ఆయన ఏదో యాత్రను ప్రారంభించాడు.. ఆ యాత్ర ఏమిటో ఇప్పటి వరకూ మూడు నాలుగు జిల్లాలను దాటలేదు. విభజత ఏపీ చిన్నది అనుకుంటే..ఆ చిన్న రాష్ట్రంలో కూడా పవన్ సుడిగాలిపర్యటన ఒకటి చేయలేకపోయాడు.

ఆయన యాత్రలకు కష్టం తక్కువ.. బ్రేకులు ఎక్కువ అన్నట్టుగా ఉంది కథ. ఇలాంటి నేపథ్యంలో పవన్ కల్యాణ్ పార్టీ వచ్చే ఎన్నికల పోటీలో ఉంటుందా? అనే సందేహం జనించడంలో పెద్ద ఆశ్చర్యం లేదు.

ఎన్నికల్లో పోటీ చేసే పార్టీ వ్యవహారాలు ఇలా అర్రీబుర్రీగా ఉండవు. పవన్ కల్యాణ్ పార్టీ మాత్రం ఇప్పటి వరకూ బాలారిష్టాలను దాటలేకపోతోంది. నూతన సంవత్సరంలో తను పార్టీ తరఫున గట్టిగా పని చేస్తానని పవన్ ప్రకటించుకున్నాడు. మరి మళ్లీ ఆయన గోదావరి జిల్లాలకే పరిమితం అవుతాడా లేక రాష్ట్ర వ్యాప్తంగా పోటీ చేసేంత కసరత్తు చేస్తాడా? ఎన్నికలకు ఇంకా అంత సమయం ఉందా? అనేవి సందేహాలుగా ఉన్నాయి.