Home సినిమా ‘పడి పడి లేచే మనసు’ మూవీ రివ్యూ

‘పడి పడి లేచే మనసు’ మూవీ రివ్యూ

SHARE

శర్వానంద్ కు ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఉంది. ఫిదాతో సాయిపల్లవి ఇమేజ్ కూడా అభిమానుల్లో చాలా స్పెషల్ గా నిలిచిపోయింది. ఈ కాంబోలో సినిమా అంటే సహజంగానే ఆసక్తి కలుగుతుంది. అందులోనూ ప్రేమ కథ అంటే వేరే చెప్పాలా. అందుకే పడి పడి లేచే మనసు ప్రమోషన్ స్టేజి నుంచే యూత్ లో మంచి హైప్ తెచ్చుకుంది. విపరీతమైన పోటీ ఉన్నా సరే తనకంటూ బజ్ వచ్చేలా చేసుకున్న ఈ ఎమోషనల్ అండ్ సెన్సిటివ్ లవ్ స్టొరీ పడిపోయిందా లేక మనసులు గెలుచుకుందా రివ్యూలో చూద్దాం పదండి

కథ

కోల్కతాలో ఉండే సూర్య(శర్వానంద్)మెడికో అయిన వైశాలి(సాయి పల్లవి)ని మొదటి చూపులోనే ప్రేమిస్తాడు. ముందు కాదన్నా తర్వాత వైశాలి కూడా తనను ఇష్టపడుతుంది. అయితే సూర్యకు తన కుటుంబంలో ఏర్పడ్డ సమస్యకు వ్యక్తిగత కారణంగా వైశాలితో వెంటనే పెళ్లి వద్దనుకుంటాడు. వదులుకోలేనంత ప్రేమ ఉన్నప్పుడే చేసుకుందామని చెప్పి ఏడాది పాటు దూరంగా ఉండాలని నిర్ణయించుకుంటారు. తర్వాత జరిగిన పరిణామాలు ఏమిటి, ఈ ప్రేమకథ చివరికి ఎక్కడికి చేరుకుంది అనేదే పడి పడి లేచే మనసు

నటీనటులు

శర్వానంద్ నటన గురించి కొత్తగా చెప్పాల్సింది ఏమి లేదు. ప్రస్థానంలో మంచి కోసం చెడు చేయాల్సి వచ్చిన రాజకీయ నాయకుడి కొడుకుగా, మళ్ళి మళ్ళి రాని రోజులో భావోద్వేగాలు నింపుకున్న ప్రేమికుడిగా ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇవ్వడంలో ఎప్పుడు ఫెయిల్ కాలేదు. ఇందులో సూర్య పాత్ర కూడా అదే కోవలోకి వస్తుంది. నచ్చిన అమ్మాయిని మనసు నొప్పించుకుండా ప్రేమను వ్యక్తపరిచే సూర్యగా పూర్తిగా జీవించేసాడు.

కోల్కతా ఎపిసోడ్స్ మంచి ఎనర్జీతో నటించాడు. ఎమోషనల్ సీన్స్ లో సైతం తన శైలిని మిస్ కాకుండా బెస్ట్ ఇచ్చాడు. వైశాలిగా సాయి పల్లవి మెడికో పాత్రను బాగా ఓన్ చేసుకుంది. బరువైన సీన్స్ లో చక్కని ఈజ్ తో నటించేసింది. అయితే ఫిదాలో స్వంత డబ్బింగ్ చెప్పుకోవడం ఏదైతే ప్లస్ గా నిలిచిందో ఇందులో అంత ఎఫెక్ట్ ఇవ్వలేకపోయింది.

మురళి శర్మ, సుహాసినిలవి అలవాటైన పాత్రలే. ప్రియరామన్ చాలా కాలం తర్వాత తెలుగు తెరపై కనిపించడం విశేషం. అయితే మరీ స్పెషల్ గా అనిపించే రోల్ కాకపోవడంతో అంతగా గుర్తుండిపోయే ఛాన్స్ లేదు. ప్రియదర్శి హీరోగా ఫ్రెండ్ గా చేసిన కామెడీ జస్ట్ ఓకే. టైమింగ్ మాత్రం బాగానే మైంటైన్ చేసాడు. వెన్నెల కిషోర్ అలవాటైన రీతిలో చేసుకుంటూ పోయాడు. నియోల్ సాన్ నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రను బాగానే క్యారీ చేసాడు. చాయ్ బిస్కెట్ సుహాస్ కు కొంత స్కోప్ దక్కింది.

సాంకేతిక వర్గం

దర్శకుడు హను రాఘవపూడిది ప్రత్యేకమైన శైలి. మొదటి సినిమా అందాల రాక్షసి మొదలుకుని గత ఏడాది వచ్చిన లై దాకా ఇది స్పష్టంగా కనిపిస్తుంది. ప్రతిదీ డిటైల్డ్ గా చెప్పాలనుకునే ప్రయత్నమే నిడివిని పెరిగేలా చేస్తుంది. ఇద్దరు ప్రేమికుల మధ్య సంఘర్షణను కొత్త పాయింట్ తో ప్రెజెంట్ చేద్దామనుకున్న హను ఆలోచన మంచిదే కానీ కథలో కనిపించిన డెప్త్ కథనంలో లేకపోవడం వల్ల సాగతీత కనిపిస్తుంది. ఈ స్టైల్ వల్లే మంచి సినిమాగా పేరు తెచ్చుకున్న అందాల రాక్షసి గొప్ప క్లాసిక్ గా మారలేకపోయింది.

ఇందులో కూడా హను రాఘవపూడి అదే పొరపాటు చేసాడు. ఫస్ట్ హాఫ్ మొత్తం సూర్య,వైశాలిల మధ్య అందమైన ప్రేమ ట్రాక్ రాసుకున్న హను దానికి తగ్గట్టే యూత్ కి కనెక్ట్ అయిపోయే సన్నివేశాలు అల్లుకున్నాడు. అయితే కీలకమైన బ్రేకప్ పాయింట్ ను మాత్రం అతి మాములుగా ప్రెజెంట్ చేయడంతో అప్పటిదాకా ఉన్న ఫీల్ ఇంటర్వెల్ నుంచి తగ్గడం మొదలవుతుంది. స్వచ్ఛమైన ప్రేమికులను చూస్తున్నామన్నా ఫీలింగ్ కరగడం మొదలువుతుంది. ఫస్ట్ హాఫ్ లో టెంపో అలాగే కొనసాగించి ఉంటే ఇది మళ్ళి మళ్ళి రాని రోజుని మించిన గొప్ప సినిమా అయ్యేది.

కొందరు దర్శకుడు నిడివి దగ్గర ఎందుకు రాజీ పడరో అర్థం కాదు, ఇరవై నిమిషాల పాటలు తీసేస్తే ఇందులో టాకీ పార్టే రెండు గంటల ఇరవై నిముషాలు ఉంది. అలాంటిది బోర్ కొట్టకుండా ఓ లవ్ స్టోరీని చెప్పడం అంత ఈజీ కాదు. హను తాను చెప్పాలనుకున్నది మొదటి సగంలోనే చెప్పేయడంతో రెండో భాగంలో పూర్తిగా తడబడ్డాడు. సూర్య, వైశాలిల మధ్య గ్యాప్ రావడానికి కారణం కన్విన్సింగ్ గానే ఉన్నప్పటికీ అంత కంటే లోతైన బలమైన కోణం ఆశిస్తారు ప్రేక్షకులు. అది రొటీన్ గా ఉండటంతో అసలు చిక్కు వస్తుంది దీంతో సెకండ్ హాఫ్ భరించలేని ప్రహసనంగా మారిపోయింది. ఎప్పుడెప్పుడు సినిమా అయిపోతుందా అని ఎదురు చూసే దాకా తెచ్చాడు హను రాఘవపూడి.

విశాల్ చంద్రశేఖర్ ఫీల్ గుడ్ మ్యూజిక్ ఇచ్చాడు. రెండు పాటలతో పాటు టైటిల్ ట్రాక్, బీజీఎమ్ అన్ని పర్ఫెక్ట్ గా కుదిరాయి. తనవరకు లోపమేమి లేదు. ఇటీవలి కాలంతో విసుగెత్తిపోయే పాటలతో చిరాకులో ఉన్న సంగీత ప్రియులకు ఇది కాస్త రిలీఫ్ ఇచ్చే ఆల్బమే. జెకె సినిమాటోగ్రఫీ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. కోల్కతాను చూపించిన తీరు ఆకట్టుకుంది. ముఖ్యంగా వైశాలిని ఎలివేట్ చేసే సీన్స్ లో మంచి పనితనం కనిపిస్తుంది.

నేపాల్, ఖాట్మండు, వెస్ట్ బెంగాల్ అందాలన్నీ చక్కగా కనపడ్డాయి. హను ఏదైతే మూడ్ ని క్యారీ చేయాలనుకున్నాడో దాన్ని కెమెరా కంటితో చూపించిన జెకె తన వరకు ఫెయిల్యూర్ లేకుండా చూసుకున్నాడు. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ మాత్రం షార్ప్ గా ఉంటే బాగుండేది. సెకండ్ హాఫ్ ల్యాగ్ ను ఆయన ఎందుకు నిర్లక్ష్యం చేసారో అర్థం కాదు. నిర్మాతలు ప్రసాద్-సుధాకర్ లు స్క్రిప్ట్ డిమాండ్ చేసినంత ఖర్చు పెట్టుకుంటూ పోయారు. రాజీ అన్న ప్రస్తావన లేకుండా ఇంత చేయడం అంటే చిన్న విషయం కాదు. ఆ ధైర్యానికి మెచ్చుకోవచ్చు

పాజిటివ్ పాయింట్స్

శర్వా-సాయిపల్లవి కెమిస్ట్రీ
మ్యూజిక్
జేకే కెమెరా
ఫస్ట్ హాఫ్

నెగటివ్ పాయింట్స్

స్లో నెరేషన్
కాన్ఫ్లిక్ట్ పాయింట్ వీక్ గా ఉండటం
సెకండ్ హాఫ్
విసిగించే కథనం

చివరి మాట

హను రాఘవపూడి మరోసారి తన మార్క్‌ పొయటిక్‌ ప్రేమకథతో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. కథా కథనాలు కాస్త నెమ్మదిగా సాగిన విజువల్స్‌, హీరో హీరోయిన్ల కెమిస్ట్రీ, కామెడీ, సాంగ్స్‌ ఇలా అన్ని తొలి భాగాన్ని ఇంట్రస్టింగ్‌గా మార్చేశాయి. కానీ ఇంటర్వెల్‌ సీన్‌ విషయంలో కాస్త తడబడ్డట్టుగా అనిపిస్తుంది. హీరో హీరోయిన్ల విడిపోవడానికి కారణం కన్విన్సింగ్‌గా అనిపించదు. తొలి భాగాన్ని ఎంగేజింగ్‌గా తెరకెక్కించి ద్వితీయార్థంలో మాత్రం దర్శకుడు ఇబ్బంది పడ్డాడు. సినిమా రొటీన్ సీన్స్ తో సాగటంతో కాస్త బోరింగ్‌గా అనిపిస్తుంది. అక్కడక్కడా సునీల్‌ కామెడీ వర్క్‌ అవుట్‌ అయినా ఫస్ట్ హాఫ్ స్థాయిలో ఆకట్టుకోలేకపోయాడు.క్లైమాక్స్‌ సన్నివేశాలు కూడా హడావిడిగా ముగించేసినట్టుగా అనిపిస్తుంది. విశాల్ చంద్రశేఖర్‌ తన సంగీతంతో మ్యాజిక్‌ చేశాడనే చెప్పాలి. పాటలతో పాటు నేపథ్య సంగీతం కూడా కట్టిపడేస్తుంది. సినిమాటోగ్రఫి, ఆర్ట్‌ సూపర్బ్‌ అనిపించేలా ఉన్నాయి. కొన్ని ఫ్రేమ్స్‌ మణిరత్నం సినిమాలను గుర్తు చేస్తాయి. ఎడిటింగ్‌, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.

రేటింగ్ : 2.5/5