Home రాజకీయాలు వైఎస్సార్‌సీపీలో చేరిన హిందూపురం టీడీపీ మాజీ ఎమ్మెల్యే

వైఎస్సార్‌సీపీలో చేరిన హిందూపురం టీడీపీ మాజీ ఎమ్మెల్యే

SHARE

అనంతపురం జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బ తగిలింది. హిందూపురం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్‌ నాయకుడు అబ్దుల్‌ గని శనివారం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా శ్రీకాకుళం జిల్లాలో పాదయాత్ర చేస్తున్న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో అబ్దుల్‌ గని పార్టీలో చేరారు. ఘనీని ఆహ్వానించిన జగన్, ఆయనకు పార్టీ కండువాను కప్పారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ, అబ్దుల్ వంటి ప్రజా నాయకుడు పార్టీలో చేరడంతో హిందూపురం ప్రాంతంలో వైకాపా మరింతగా బలపడిందని అన్నారు. గత నాలుగున్నరేళ్ల పాలనలో మైనారిటీలకు చంద్రబాబునాయుడు చేసేందేమీ లేదని ఈసందర్భంగా అబ్దుల్‌ గని పేర్కొన్నారు.

ఇదే సమయంలో ఘనీ స్పందిస్తూ, నాలుగున్నరేళ్ల పాలనలో మైనారిటీలకు చంద్రబాబు చేసిందేమీ లేదని వ్యాఖ్యానించారు. తెలుగుదేశం పార్టీలో మూడు దశాబ్దాలుగా తాను పనిచేశానని, తనకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆరోపించారు. మైనారిటీలకు 4 శాతం రిజర్వేషన్ కల్పించిన ఘనత వైఎస్ రాజశేఖరరెడ్డిదేనని, ఆయన ఇచ్చిన ఫీజు రీయింబర్స్ మెంట్ ఎంతో మంది విద్యార్థులకు అండగా నిలిచిందని అన్నారు.

కాగా, గత అసెంబ్లీ ఎన్నికల్లో హిందూపురం స్థానాన్ని అబ్దుల్ ఘనీ ఆశించగా, ఆ స్థానం నుంచి నందమూరి బాలకృష్ణను టీడీపీ బరిలోకి దింపిందన్న సంగతి తెలిసిందే. వచ్చే సంవత్సరం జరిగే ఎన్నికల్లోనూ ఆయనకు టీడీపీ టికెట్ లభించే  అవకాశాలు లేకపోవడంతోనే, ఆయన పార్టీని వీడారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.