Home రాజకీయాలు పవన్ పర్యటన.. జనసేనలో ఆ ఊపేదీ..?

పవన్ పర్యటన.. జనసేనలో ఆ ఊపేదీ..?

SHARE

చాలా కాలం తర్వాత రాయలసీమ వైపు వెళ్లాడు జనసేన అధిపతి పవన్ కల్యాణ్, తన పార్టీ తరఫున కార్యక్రమాలు మొదలుపెట్టిన తర్వాత పవన్ సీమ వైపు ఇటీవలే తొలి సారి వెళ్లాడు. ఆరు నెలల కిందట పవన్ అనంతపురం వెళ్లినా అప్పుడు తెలుగుదేశం పార్టీ భాగస్వామిగా వెళ్లాడు. పవన్ ఇప్పుడు కూడా టీడీపీ భాగస్వామే అనేది కొంతమంది ఫీలింగ్.

ఎలాగైతేనేం పవన్ కల్యాణ్ రాయలసీమ వెళ్లాడు, అనంతపురంలో పర్యటించాడు. పవన్ కల్యాణ్ ఇప్పుడిప్పుడే తన పార్టీ కార్యక్రమాలను మొదలుపెట్టాడు. ఇలాంటి నేపథ్యంలో.. పవన్ అక్కడ పర్యటించాడు కాబట్టి భారీ ఎత్తున నేతలు, కార్యకర్తలు జనసేనలోకి చేరాల్సింది. అయితే పవన్ పర్యటనలో అలాంటి హడావుడి ఏమీ కనిపించలేదు.

అక్కడ పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. చంద్రబాబును ఏమీ అనకుండా జగన్ మీదే విరుచుకుపడ్డాడు. జగన్ అధికారంలో ఉన్నాడేమో అనిపించేంతలా పవన్ కల్యాణ్ ప్రసంగాలు సాగాయి.

ఇక పవన్ కల్యాణ్ రాయలసీమకు వెళ్లి, అందునా అనంతపురం వెళ్లి వచ్చాకా అక్కడ ఇద్దరు నియోజకవర్గ స్థాయి నేతలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరడం విశేషం. చిత్తూరు జిల్లా పీలేరు నేత ఇక్బాల్ అహ్మద్ వైసీపీలోకి చేరాడు. ఈయన జనసేనలోకి చేరతాడనే అంచనాలు ఉండేవి. ఇక హిందూపురం మాజీ ఎమ్మెల్యే అబ్దుల్ ఘనీ కూడా వైసీపీలోకే చేరాడు. జనసేనను ఎవరూ ప్రత్యామ్నాయంగా భావించలేదు అని చెప్పడానికి ఈ పరిణామాలు చాలేమో!