Home రాజకీయాలు ఎవ్వరూ తగ్గట్లేదు.. సీట్ల నంబర్లతో బల్ల గుద్దుతున్నారు!

ఎవ్వరూ తగ్గట్లేదు.. సీట్ల నంబర్లతో బల్ల గుద్దుతున్నారు!

SHARE

వీళ్ల ఆత్మవిశ్వాసాలకు ఈవీఎంలలో నిక్షిప్తం అయిన ఫలితాలు కూడా మారిపోతాయేమో కానీ.. తెలంగాణ లీడర్లు అస్సలు తగ్గడం లేదు. ఒకరికి మించిన స్థాయిలో మరొకరు ఆత్మవిశ్వాసాలను వ్యక్తం చేస్తున్నారు. ఒకరేమో వంద సీట్లు ఖాయంగా తమ పార్టీనే సొంతం చేసుకుంటుందని అంటుంటే.. మరి కొందరు ఆ నంబర్ ను కాస్త తగ్గించి ఎనభై సీట్లలో తమదే విజయం అని చెబుతున్నారు.

తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి, ఇటు కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి అదే కాన్ఫిడెన్స్ వ్యక్తం అవుతోంది. శనివారం రోజున మీడియా ముందుకు వచ్చి నేతలు ఇలా బల్ల గుద్ది చెబుతున్నారు. అధికారం తమ సొంతమే అవుతుందని స్పష్టం చేస్తున్నారు. పోలింగ్ తర్వాత కూడా ఎవ్వరిలోనూ ఆత్మవిశ్వాసం కాస్తైనా తగ్గినట్టుగా కనిపించడం లేదు. పోల్ తర్వాత కూడా ఎవరి విశ్వాసం వారు వ్యక్తం చేస్తున్నారు.

ఎగ్జిట్ పోల్సేమో తెరాస వైపు మొగ్గు చూపుతున్నాయి. కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అయ్యే ఛాన్సులు ఉన్నాయని వివిధ మీడియా సంస్థల ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. అదే నమ్మేద్దాం అనుకుంటున్న దశలో మహాకూటమి తరఫు నుంచి మాత్రం గట్టి మాటలే వినిపిస్తున్నాయి.
వీళ్లకు లగడపాటి కావాల్సినంత బూస్టింగ్ ఇచ్చాడు. జాతీయ మీడియా సంస్థల ఎగ్జిట్ పోల్స్ కు భిన్నంగా.. లగడపాటి కూటమిదే అధికారం అని తేల్చి చెప్పాడు. ఇలాంటి నేపథ్యంలో కూటమిలోని నేతలకు కొత్త ఆశలు మొగ్గతొడిగినట్టుగా ఉన్నాయి.

వివిధ జిల్లాల్లో నేతలు మాట్లాడుతూ.. ఆయా జిల్లాల్లో తమ పార్టీనే స్వీప్ చేస్తుందని అంటే, పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. ఎనభై సీట్లలో విజయం తమదే అని అన్నాడు. మరి ఇప్పుడు ఏం చెప్పినా పెద్దగా ఉపయోగం ఉండదు కదా.. ఓట్లు పడిపోయాయి, ఇక అసలు కథ ఏమిటో డిసెంబర్ పదకొండున తేలిపోతుంది!