Home రాజకీయాలు కూటమి ఓడితే.. బాబుకు కాంగ్రెస్ గుడ్ బై?!

కూటమి ఓడితే.. బాబుకు కాంగ్రెస్ గుడ్ బై?!

SHARE

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలు చేతులు కలిపాయి. దశాబ్దాల తమ వైరాన్ని ఆ రెండు పార్టీలూ పక్కన పెట్టాయి. ఏపీలో అంటే కాంగ్రెస్ లేదని అనుకుందాం. అయితే తెలంగాణలో కూడా కాంగ్రెస్ నేతలు దశాబ్దాల పాటు చంద్రబాబుకు వ్యతిరేకంగా పని చేసిన వాళ్లే. అధికారంలో ఉన్నప్పుడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబుతో పోరాడిన నేపథ్యం ఉంది వీళ్లకు. ఇలాంటి తీరుతో వీరు దశాబ్దాల పాటు జనాలను ఫూల్స్ గా చేశారు.

కాంగ్రెస్, తెలుగుదేశం అంటూ విడిపోయి జనాలు ఒకరికి మరొకరు నష్టాలు చేసుకున్నారు. హత్యలు కూడా చేసుకున్నారు. జనాల మధ్యన అలా రాజకీయ వైరాలను పెంచి పోషించిన నేతలు తమ అవకాశ వాదం కొద్దీ చేతులు కలిపారు. ఎన్నికల్లో కలిసి పోటీ చేశారు.

తెలంగాణ ఎన్నికల్లో ఆ టెస్టింగ్ డోస్ పడింది. మరి దీని ఫలితాలు ఎలా ఉంటాయో మంగళవారం రోజున తెలిసిపోతుంది. ప్రస్తుతానికి ఉన్న పరిస్థితిని చూస్తే.. తెలంగాణలో కూటమికి అధికారం దక్కడం జరిగేలా లేదు. కేసీఆర్ ను కలిసి కట్టుగా కూడా వీళ్లు ఓడించలేకపోతున్నారని స్పష్టం అవుతోంది.

మరి అదే జరిగితే.. కాంగ్రెస్ పార్టీ ఎలా వ్యవహరిస్తుందనేది ఆసక్తిదాయకమైన అంశం. కూటమి గనుక ఓడితే కాంగ్రెస్ నేతలు చంద్రబాబుపై విరుచుకుపడే అవకాశం ఉంది. బాబుతో చేతులు కలపడం వల్లనే తెలంగాణలో ఓడామని వారు ధ్వజమెత్తే అవకాశాలున్నాయి. ఇది కొంత వరకూ నిజమే. ఒకవేళ కాంగ్రెస్ గనుక చంద్రబాబుతో చేతులు కలపకపోయుంటే.. వాళ్లను విమర్శించడానికి కేసీఆర్ చేతిలో ఏ అవకాశమూ ఉండేదే కాదు.

కచ్చితంగా చెప్పగలిగే అంశం ఏమిటంటే.. కూటమి ఓడితే కాంగ్రెస్, చంద్రబాబుల మధ్యన దూరం పెరుగుతుంది. ఢిల్లీ సంగతులు ఏమో కానీ.. మళ్లీ కాంగ్రెస్,టీడీపీలు కలిసి పోటీ చేయడం ఉండకపోవచ్చు.