Home రాజకీయాలు ముగిసిన తెలంగాణ ప్రచారం..అసలైన మలుపు ఇప్పుడే?

ముగిసిన తెలంగాణ ప్రచారం..అసలైన మలుపు ఇప్పుడే?

SHARE

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచార పర్వం ముగిసింది. డిసెంబర్ ఏడో తేదీన పోలింగ్ జరగనున్న నేపథ్యంలో పార్టీలు ప్రచార పర్వాన్ని ముగించాల్సి వచ్చింది. ఈ రోజుతో ప్రచార పర్వం ముగిసింది. రేపు విరామ సమయం. ఎల్లుండి పోలింగ్ జరగాల్సి ఉంది.

ఇప్పటి వరకూ పార్టీలు తమ అస్త్రశస్త్రాలన్నింటినీ సంధించేశాయి. తీవ్రంగా కష్టపడ్డాయి. ఈ ఎన్నికలు ముందస్తుగా జరుగుతున్నవని వేరే చెప్పనక్కర్లేదు. మరి కాస్త సమయం ఉన్నా.. కేసీఆర్ ఈ ముందస్తు ఎన్నికలకు వెళ్లాడు. దీంతో అన్ని పార్టీలూ ఎన్నికలను ఎదుర్కొనాల్సి వచ్చింది. అయితే కేసీఆర్ తెచ్చిన ఎన్నికలే అయినా.. అనూహ్యంగా కేసీఆర్ తీవ్రంగా కష్టపడాల్సి వచ్చింది.

కాంగ్రెస్, టీడీపీలు వేర్వేరుగా పోటీ చేసి ఉంటే కేసీఆర్ మరీ ఇంతలా కష్టపడాల్సి వచ్చేది కాదేమో. అయితే కాంగ్రెస్, టీడీపీలు కలిసి పోటీ చేయడంతో.. వారి బలం ఎక్కడ ఏకం అవుతుందో అనే సమీకరణాలు తలెత్తాయి. దీంతో కేసీఆర్ తీవ్రంగా కష్టపడ్డాడు. దాదాపు వంద నియోజకవర్గాల్లో కేసీఆర్ సుడిగాలి పర్యటనలు చేశాడు. తన పార్టీని గెలిపించాలని కోరాడు.

ఇక మహాకూటమి కూడా తన ప్రయత్నాలు అన్నీ చేసింది. మీడియా బలం కలిసి రావడంతో కూటమి బలోపేతం అయ్యిందనే విశ్లేషణలు వినిపించాయి. బీజేపీ కూడా తన వంతు ప్రయత్నం చేసింది.

ఇక రేపు మరింత కీలకం. కీలకమైన నోట్ల పంపకాలు రేపు జరిగే అవకాశాలున్నాయి. ఎన్నికల్లో ఓట్ల కొనుగోలు కూడా కీలకమైన అంశమే కాబట్టి.. రేపు కూడా ఫలితాలు మారిపోయే పరిణామాలు చోటు చేసుకోవచ్చనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.