Home రాజకీయాలు తెలంగాణలో ప్రచారం.. ఏపీలో టీడీపీ పరువు పోయింది!

తెలంగాణలో ప్రచారం.. ఏపీలో టీడీపీ పరువు పోయింది!

SHARE

తెలంగాణలో తెలుగుదేశం పార్టీ నేతల ప్రచారం ఏపీలో ఆ పార్టీ పరువును తీసిందని అంటున్నారు విశ్లేషకులు. ఇక్కడ చంద్రబాబునాయుడు, ఆయన బామ్మర్ది బాలకృష్ణలు చెప్పిన నీతులతో ఏపీలో తెలుగుదేశం పార్టీ డిఫెన్స్ లో పడిపోయిందని వారు అంటున్నారు. తెలంగాణలో చంద్రబాబు నాయుడు, బాలకృష్ణలు చేసిన ఎన్నికల ప్రచారం ఇప్పటికే వీడియోల రూపంలో వైరల్ అవుతున్నాయి.

తెలంగాణలో పాలనను రకరకాలుగా విమర్శించారు చంద్రబాబు, బాలకృష్ణ. అందులో ప్రధానంగా ఫిరాయింపుదారులను తీవ్రంగా తప్పు పట్టారు. తన పార్టీ తరఫున నెగ్గి తెరాసలోకి చేరిన వారిపై చంద్రబాబు నాయుడు తీవ్రంగా విరుచుకుపడ్డాడు. వాళ్లను ద్రోహులుగా అభివర్ణించాడు. వాళ్లను అనేక మాటలు అన్నాడు. అలాగే బాలయ్య కూడా తనకు తెలిసిన తిట్లను తిట్టాడు.

ఏపీలో తెలుగుదేశం పార్టీ ఫిరాయింపుదార్లను ఏ స్థాయిలో ప్రోత్సహిచిందో తెలిసిన సంగతే. నలుగురు ఫిరాయింపుదార్లకు మంత్రి పదవులను కూడా ఇచ్చాడు చంద్రబాబు నాయుడు. ఇంత చేసి తెలంగాణలో బాబు పిరాయింపుదార్లను తిట్టాడు.

ఇక తెలంగాణలో దుబారా పాలన సాగుతోందని, కేసీఆర్ ఆర్థికంగా దుబారా చేస్తున్నాడని కూడా బాబు రెచ్చిపోయాడు. అయినా బాబుతో పోలిస్తే కేసీఆర్ దుబారా చాలా తక్కువే అని చెప్పనక్కర్లేదు. ఈ అంశాలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా గట్టిగా పట్టుకుని నిలదీసింది. ఫిరాయింపుదారులను ఏపీలో కూడా ఓడించమని పిలుపునిస్తారా అని సవాల్ చేసింది.

టీఆర్ఎస్ కూడా చంద్రబాబుపై ధ్వజమెత్తింది. బాబు చేస్తే సంసారం, వేరే వాళ్లు చేస్తే వ్యభిచారమా అని టీఆర్ఎస్ నేతలు బాబును నిలదీశారు. ఈ విధంగా తెలంగాణలో ప్రచారానికి అంటూ వెళ్లి ఏపీలో పరువు పోగొట్టుకున్నారు టీడీపీ వాళ్లు!