Home రాజకీయాలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి టీడీపీ ఎమ్మెల్యే…?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి టీడీపీ ఎమ్మెల్యే…?

SHARE

తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్యేల వలసలు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. తాజాగా ఒక మాజీ మంత్రి ఎమ్మెల్యే పదవికి సైతం రాజీనామా చేసి జనసేనలోకి వెళ్లిపోయాడు. ఆయన ముందుగా వైసీపీలోనే ప్రయత్నాలు చేశాడు. వైసీపీకి భారీగా ఫండ్ సైతం ఇస్తానని ఆయన అన్నాడట. అయితే ఆయన ఆశించిన సీట్లలో జగన్ మోహన్ రెడ్డి వేరే అభ్యర్థులను పెట్టుకున్నాడు. ఈ నేపథ్యంలో ఆయన జనసేన వైపుకు వెళ్లిపోయినట్టుగా తెలుస్తోంది.

ఇక మరో ఎమ్మెల్యే ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నాడని సమాచారం. ఆయన మరెవరో కాదు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి. టీడీపీ తరఫున గతంలో ఎంపీగా వ్యవహరించాడీయన. ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నాడు. తాజాగా తన జిల్లాలో తన సామాజికవర్గం వారు నిర్వహించిన కార్తీక మాస వనసమారాధనకు ఆయన హాజరయ్యాడు. ఈ కార్యక్రమంలో ఆయన తెలుగుదేశం పార్టీ విషయంలో కీలక వ్యాఖ్యలు చేసినట్టుగా సమాచారం.

టీడీపీ పాలనతో రెడ్లను అణగదొక్కుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడట. కాసు మహేశ్ రెడ్డిని గెలిపించాలని కూడా మోదుగుల పిలుపునిచ్చినట్టుగా సమాచారం. ఈ నేపథ్యంలో మోదుగుల వైసీపీలోకి చేరడం కూడా ఖాయమని తెలుస్తోంది. ఈ వనభోజన కార్యక్రమంలో వైఎస్ కు ఘన నివాళి అర్పించారు. మోదుగుల కూడా ఆ కార్యక్రమంలో పాల్గొన్నాడు.

తెలుగుదేశం పార్టీని వీడటానికి మోదుగుల రెడీ అయిపోయాడని.. త్వరలోనే ఆయన వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నాడనే వార్తలకు ఇప్పుడు మరింత ఊపు వస్తోంది.