Home రాజకీయాలు చంద్రబాబును తరిమికొట్టండి

చంద్రబాబును తరిమికొట్టండి

SHARE

తెలంగాణ టీడీపీలో గెలిచి పార్టీ మారిన ఎమ్మెల్యేలని చిత్తుగా ఓడించండి అన్నావ్‌.. మరి ఏపీలో అదే మాట చెప్పగలవా అని టీడీపీ అధినేత నారా చంద్రనాయుడు నుద్దేశించి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా ప్రశ్నించారు. విజయవాడలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో రోజా విలేకరులతో మాట్లాడుతూ.. ఏపీలో ఎమ్మెల్యేలు అమ్ముడు పోతే అభివృద్ధి చూసి వచ్చారు అంటావ్‌.. మరి తెలంగాణలో పార్టీ మారితే నీతి బాహ్యమా అని అడిగారు. చంద్రబాబు మాటలు వింటే సిగ్గు కూడా సిగ్గుతో చచ్చిపోతుందని వ్యాక్యానించారు. తెలంగాణ ప్రజలు వెర్రివాళ్లు కాదు చంద్రబాబు చెప్పే మాటలు విని ఓటు వేయడానికి అన్నారు.

చెప్పేవాడు చంద్రబాబు అయితే వినేవాడు వెర్రివాడని చిత్తూరు జిల్లా ప్రజలు అనుకుంటున్నారని చెప్పారు. తెలంగాణ ప్రజలు చంద్రబాబుకి బుద్ధిచెప్పాల్సిన సమయం వచ్చిందని గుర్తు చేశారు. ఊసరవెల్లిలా రంగులు మార్చే చంద్రబాబుకి అందరూ బుద్ధిచెప్పాలని ప్రజలను కోరారు. స్పీకర్‌ కోడెల శివప్రసాద రావు రాజ్యాంగ పదవికి మచ్చ తెచ్చారని, రాజ్యాంగాన్ని కాపాడాల్సిన స్పీకర్‌ దాన్ని అపహాస్యం చేస్తున్నారని మండిపడ్డారు. వైఎస్‌ జగన్‌ గురించి మాట్లాడే అర్హత పవన్‌ కల్యాణ్‌కి లేదని అన్నారు. ఏపీలో 23 మంది ఎమ్మెల్యేలను టీడీపీ అక్రమంగా డబ్బులు పెట్టి కొన్నపుడు పవన్‌ కల్యాణ్ ప్రశ్నించకుండా మిన్నకుండిపోయారని వ్యాఖ్యానించారు.

బాలకృష్ణ అసెంబ్లీకి రారు.. హిందూపూర్‌కి వెళ్లరు కానీ తెలంగాణాలో ప్రచారానికి మాత్రం వెళ్తున్నారని విమర్శించారు. మీ(బాలకృష్ణ) బావ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలను కొన్నప్పుడు, వారిని మంత్రుల్ని చేసినపుడు లేవని నోరు ఇప్పుడెలా లేస్తుందని ప్రశ్నించారు. టీడీపీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తుంటే మీ నందమూరి కుటుంబం పౌరుషం ఏమైందని అడిగారు. నందమూరి సుహాసినిని కూడా కరివేపాకులా వాడుకుంటున్నారని, ఓడిపోయే స్థానం కట్టబెట్టి ఆమెని బలిపశువుని చేస్తున్నారని వ్యాఖ్యానించారు.