Home రాజకీయాలు వాళ్లను తెలంగాణ కాంగ్రెస్ దూరం చేసుకున్నట్టే!

వాళ్లను తెలంగాణ కాంగ్రెస్ దూరం చేసుకున్నట్టే!

SHARE

తెలంగాణ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోటీ చేయలేదు అనేది తెలిసిన సంగతే. ప్రస్తుతానికి తన టార్గెట్ ను పూర్తిగా ఏపీ మీదే పెట్టాడు జగన్ మోహన్ రెడ్డి. అందులో భాగంగా జగన్ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ జోలికి వెళ్లలేదు. అలాగని తెలంగాణలో జగన్ కు బలంలేదని, బలగంలేదని కాదు. తెలంగాణలో వైఎస్ ఇమేజ్ తో జగన్ కు బలం ఉంది. గత ఎన్నికల్లో అది ఒక ఎంపీ సీటును మూడు ఎమ్మెల్యే సీట్లను తెచ్చి పెట్టింది. అలాగే పలు స్థానాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చెప్పుకోదగిన స్థాయిలో ఓట్లను తెచ్చుకుంది కూడా.

ఇలాంటి నేపథ్యంలో అలా జగన్ ను అభిమానించి ఓటేసే వాళ్లు ఈ సారి ఎటు వైపు అనేది ఆసక్తిదాయకంగా మారింది. వైకాపా పోటీలో లేని నేపథ్యంలో జగన్ మోహన్ రెడ్డి అభిమానగణం ఎటు వైపు మొగ్గు చూపుతారు అనేది చర్చనీయాంశం.

వైసీపీ పోటీలో లేదు కాబట్టి వీళ్లు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపే వాళ్లే. అయితే కాంగ్రెస్ పక్కన చంద్రబాబు నాయుడు చేరడంతో వీళ్లు అటు వైపు మొగ్గు చూపే అవకాశాలు కనిపించడం లేదు. సంప్రదాయ కాంగ్రెస్ ఓటు బ్యాంకు చంద్రబాబు నాయుడు పొడగిట్టనిది. ఇక జగన్ అభిమానగణం అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ చంద్రబాబు ఉన్న వైపు ఓటు వేయదు.

ఇదీ పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో జగన్ అభిమానగణం చంద్రబాబు వ్యతిరేకంగా నిలిచేందుకే మొగ్గు చూపుతోంది. అందులో భాగంగా తెరాస వైపే వీళ్లు ఓటేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. చంద్రబాబు తో జత కట్టి కాంగ్రెస్ వాళ్లు ఆ ఓటు బ్యాంకును దూరం చేసుకున్నట్టే.

కూకట్ పల్లి వంటి నియోజకవర్గంలో అయినా..గ్రేటర్ పరిధిలో అయినా.. వైసీపీ అభిమానులు తెరాసకే ఓటేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొన్ని చోట్ల మాత్రం ఇక చేసేది లేక కాంగ్రెస్ పాత నేతలను చూసి వాళ్లకు ఓటేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.