Home రాజకీయాలు చౌదరికి ఢిల్లీ హై కోర్టులో షాక్.. ఆరెస్టే నెక్ట్స్..?

చౌదరికి ఢిల్లీ హై కోర్టులో షాక్.. ఆరెస్టే నెక్ట్స్..?

SHARE

తెలుగుదేశం ఎంపీ, కేంద్రమాజీ మంత్రి సుజనా చౌదరికి ఢిల్లీ హై కోర్టులో షాక్ తగిలింది. తనను ఈడీ విచారణ నుంచి మినహాయించాలని కోరుతూ చౌదరి దాఖలు చేసిన పిటిషన్ ను ఢిల్లీ హై కోర్టు కొట్టి వేసింది. చౌదరిని ఈడీ విచారణ నుంచి మినహాయించలేమని కోర్టు స్పష్టం చేసింది. సోమవారం ఈడీ విచారణకు హాజరు కావాలని ఆదేశిస్తూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.

ఇటీవలే సుజనా చౌదరికి సంబంధించిన ఆఫీసులపై ఈడీ సోదాలు జరిగిన సంగతి తెలిసిందే. చౌదరి భారీ ఎత్తున అక్రమాలకు పాల్పడినట్టుగా ఈడీ ప్రాథమిక నిర్ధారణకు వచ్చింది. దాదాపు ఆరు వేల కోట్ల రూపాయల మొత్తాన్ని చౌదరి వివిధ కంపెనీల ద్వారా అప్పుగా తీసుకున్నాడని.. తను సృష్టించిన షెల్ కంపెనీల ద్వారా చౌదరి ఆ అప్పులను తీసుకున్నాడని ఈడీ పేర్కొంది. అలా నకిలీ కంపెనీల ద్వారా లోన్లను తీసుకుని సదరు మొత్తాన్ని తన ఖాతాలకు బదిలీ చేసుకున్నాడట చౌదరి. ఈ మేరకు అభియోగాలు మోపుతోంది ఈడీ,

తీరా ఆ షెల్ కంపెనీలు నష్టపోయాయని చెప్పి.. చౌదరి బ్యాంకులకు పంగనామాలు పెట్టాడని ఈడీ పేర్కొంది. ఈ నేపథ్యంలో బ్యాంకుల ఫిర్యాదుతో ఈడీ రంగంలోకి దిగింది. అయితే తనకు ఏ పాపం తెలీదని చౌదరి చెప్పుకుంటున్నాడు. తను విచారణకు హాజరుకావాల్సిన అవసరం లేదంటూ కోర్టుకు ఎక్కాడు. కోర్టులో కూడా ఊరట లభించలేదు.

చౌదరి సోమవారం ఈడీ విచారణకు హాజరు కావాల్సి ఉంటుందని తెలుస్తోంది. ఆయన అరెస్టు కూడా జరగవచ్చని వార్తలు వస్తున్నాయి.