Home రాజకీయాలు పవన్.. ఈ సినిమా డైలాగులు ఇంకెన్నాళ్లు!

పవన్.. ఈ సినిమా డైలాగులు ఇంకెన్నాళ్లు!

SHARE

రాజకీయాల్లో కూడా సినిమా తరహా డైలాగులు చెప్పేస్తే సరిపోతుందని అనుకుంటున్నట్టుగా ఉన్నాడు జనసేన అధిపతి పవన్ కల్యాణ్. గత ఎన్నికల ముందు ఇలాంటి డైలాగులతోనే పొద్దు పుచ్చిన పవన్ కల్యాణ్ ఇప్పుడు కూడా అవే అందుకుంటున్నాడు.

తనకు అధికారం ఇవ్వాలని అడుగుతున్న పవన్ కల్యాణ్ ఒకవేళ తనకు అధికారం దక్కాకా తను ఏవైనా తప్పులు చేస్తే తన చొక్కా పట్టుకుని నిలదీయాలని అన్నాడు. ఇప్పుడు అందరూ ఇలాగే చెబుతారు. తీరా ఎన్నికలు అయ్యాకా.. అధికారం దక్కితే అప్పుడు చొక్కా కాదు కాదు.. ఊడిపోయిన చొక్కా బొత్తాన్ని కూడా తాకనివ్వరు. ఈ విషయం ప్రజలకు ఏమీ తెలియనిది కాదు. కానీ పవన్ కల్యాణ్ మాత్రం అలాంటి డైలాగుతోనే కామెడీ చేస్తున్నట్టుగా ఉన్నాడు.

ఇలాంటి మాటలు చెప్పడం కూడా పవన్ కల్యాణ్ కు ఏమీ కొత్త కాదు. గత ఎన్నికల ముందు ఇలాంటి మాటలే చెప్పాడు పవన్. గత ఎన్నికల ముందు బీజేపీ, టీడీపీలకు అధికారం ఇవ్వాలని పవన్ కల్యాణ్ ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. అప్పట్లో పవన్ మాట్లాడుతూ.. తను చెప్పినట్టుగా బీజేపీ టీడీపీలకు అధికారం ఇవ్వాలని.. వారు అన్ని హామీలనూ అమలు చేస్తారని అన్నాడు.

ఒకవేళ ఆ పార్టీలు హామీలను అమలు చేయకపోతే వాటిని నిలదీసే బాధ్యత తనది అని ప్రకటించుకున్నాడు. హామీలను అమలు చేయకపోతే తను ఆ పార్టీలను ప్రశ్నిస్తాను అని కూడా చెప్పుకున్నాడు. అయితే ఆ హామీలు ఏ మేరకు అమలయ్యాయో.. టీడీపీ, బీజేపీలను పవన్ ఏ మేరకు ప్రశ్నించాడో అందరికీ తెలిసిందే. ఇంత ట్రాక్ రికార్డును కలిగి ఉండికూడా పవన్ మళ్లీ సినిమా డైలాగులే చెబుతున్నాడు!