Home రాజకీయాలు కేసీఆర్..కు వీటితో జరిగే నష్టమెంత?

కేసీఆర్..కు వీటితో జరిగే నష్టమెంత?

SHARE

మొన్న ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి, నిన్న ఎమ్మెల్సీ యాదవరెడ్డి.. తాజాగా ఖమ్మం జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడొకరు.. ఇలా ఈ జాబితాలో మరింతమంది ఉండబోతున్నారని వార్తలు వస్తున్నాయి. ఒకవైపు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కు సమయం ఆసన్నమవుతూ ఉంది. ఇలాంటి నేపథ్యంలో టీఆర్ఎస్ నుంచి నేతలు వరసగా బయటకు వెళ్తూ ఉన్నారు.

వెళ్తున్న వాళ్లు మరీ ప్రజా నేతలు కాకపోయినా.. ఎంపీ, ఎమ్మెల్సీ వంటి హోదాల్లో ఉన్న వారు. మొన్నటి వరకూ నేతలు తెరాసలోకి క్యూ కడితే..ఇప్పుడు తెరాస నుంచి నేతలు బయటకు వెళ్తున్నారు. అది కూడా ఎన్నికల సమయంలో. వెళ్తున్న వారు వారి వారి వ్యక్తిగత కారణాలతో తెరాసను వీడుతుండ వచ్చు. అయితే ఇది తెరాస ప్రత్యర్థి మహాకూటమికి మాత్రం సానుకూలాంశమే.

నేతలు ఇలా వస్తున్నారు కాబట్టి కేసీఆర్ తీరుతో అంతా విసిగిపోయారని చెప్పడానికి కూటమికి అవకాశం ఏర్పడుతుంది. తాము గెలవబోతున్నాము కాబట్టి నేతలు వచ్చి చేరుతున్నారని కూటమి ప్రచారం చేసుకోగలదు కూడా. ఇలాంటి ప్రచారానికి ఈ చేరికలు మహాకూటమికి బాగా ఉపయోగపడతాయి అనడంలో సందేహం లేదు.

అయితే తెరాస మాత్రం తమ పార్టీ నుంచి నేతలు ఇలా బయటకు వెళ్లడాన్ని పూర్తిగా లైట్ తీసుకున్నట్టుగా కనిపిస్తోంది. తాము గెలుస్తామనే విశ్వాసంతో ఉంది తెలంగాణ రాష్ట్ర సమితి. ఈ నేపథ్యంలో ఇలా నేతలు బయటకు వెళ్లడాన్ని పెద్ద సీరియస్ గా తీసుకోవడం లేదు. మరి ఈ నేతలు వీడటం వల్ల తెరాసకు నిజంగానే నష్టం జరుగుతుందా అనేది డిసెంబర్ పదకొండున ఫలితాలను బట్టి చెప్పవచ్చు.