Home ప్రత్యేకం అధికారంలో లేడు..అయినా అందరి టార్గెట్ జగన్!

అధికారంలో లేడు..అయినా అందరి టార్గెట్ జగన్!

SHARE

గత ఎన్నికల ముందే.. జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర రాజకీయాలకు సెంటర్ గా మారాడు. గత ఎన్నికల ముందు రాజకీయమే జగన్ కేంద్రంగా నడిచింది. ఒక్క జగన్ ను ఎదుర్కొనడానికి అంతా కలిసి వచ్చారు. తను నలభై యేళ్ల సీనియర్ ను అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు.. జగన్ ను ఎదుర్కొనడానికి అందరినీ కలుపుకుని వచ్చాడు. అంత వరకూ వైఎస్ తో పోరాటానికి చంద్రబాబు నాయుడు అందరినీ కలుపుకుని వచ్చాడు. అయితే నెగ్గలేకపోయాడు. జగన్ ను ఢీ కొట్టడానికి కూడా అప్పుడు చంద్రబాబు నాయుడు మోడీని, పవన్ కల్యాణ్ ను తెచ్చుకున్నాడు.

ఇక మీడియా వర్గాలు…లోక్ సత్తాలు..ఇలాంటివన్నీ కూడా జగన్ ను దెబ్బతీయడమే లక్ష్యంగా పని చేశాయి. అంత చేస్తే చివరకు జగన్ మీద వీళ్లంతా కలిసి స్వల్పమైన మెజారిటీతో విజయం సాధించారు.

ఇక ఇప్పుడు జగన్ ను లక్ష్యంగా చేసుకుంటూ.. మళ్లీ అంతా వస్తున్నారు. అయితే ఈ సారి వీళ్లంతా వేర్వేరుగా జగన్ ను లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఎన్నికల నాటికి వీళ్లంతా మళ్లీ ఏకం అవుతారో ఏమో కానీ.. ప్రస్తుతానికి అయితే జగన్..జగన్ అంటూ.. వీళ్లు రోజులను గడుపుతున్నారు.

ఈ విషయంలో చంద్రబాబు నాయుడు ముందున్న సంగతి తెలిసిందే. తెలుగుదేశం నేతలకు తెల్లారితే జగన్ ప్రస్తావన తప్ప మరోటి ఉండదు. ఇక మరోవైపు పవన్ కల్యాణ్ కూడా జగన్ ను మాత్రమే లక్ష్యంగా చేసుకున్నాడు. జగన్ విషయంలో తెగ పేలేస్తున్నాడు. మరి పవన్ కు చేతనైతేచంద్రబాబును ప్రశ్నించాలి కానీ జగన్ నే లక్ష్యంగా చేసుకున్నాడు.

ఇక కాంగ్రెస్ పార్టీ మరో వైపు. ఈ పార్టీ డైరెక్టుగా ప్రకటించింది జగనే తమ లక్ష్యమని. ఇక లోక్ సత్తా వంటి పార్టీలు సరేసరి. ఇప్పుడు సీబీఐ మాజీ జేడీ కూడా వస్తున్నాడు. అతడి లక్ష్యమూ జగన్ అనే అని స్పష్టం అవుతోంది. ఇలా రాష్ట్ర రాజకీయాలకు మరోసారి వైఎస్ తనయుడు కేంద్ర బిందువు అవుతున్నాడు. ఈ సారి ప్రత్యర్థులను ఆయనెలా ఎదుర్కొంటాడో చూడాలి!