Home రాజకీయాలు మాజీ జేడీ లక్ష్మినారాయణ కొత్త పార్టీ.. వైసీపీకి మేలే!

మాజీ జేడీ లక్ష్మినారాయణ కొత్త పార్టీ.. వైసీపీకి మేలే!

SHARE

సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణ తను కొత్తపార్టీని పెడతానని ప్రకటించాడు. ప్రజలకు సేవ చేయడానికి ఐపీఎస్ కేడర్ ఉద్యోగాన్ని వదిలి వచ్చానని కొన్నాళ్లుగా లక్ష్మినారాయణ చెబుతున్న సంగతే. ఇప్పటికే ఈయన రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేశాడు. అందుకు సంబంధించి నివేదికలు కూడా చంద్రబాబు నాయుడు కు ఇచ్చానని ప్రకటించాడు. తను రాజకీయాల్లోకి వస్తానని ఈయన ప్రకటించుకొంటూ వచ్చాడు. అయితే ఏ పార్టీలోకి చేరతాడనే అంశంపై మిస్టరీ మెయింటెయిన్ చేశాడు.

చివరకు ఇప్పుడు తను సొంతంగా తేల్చుకుంటానని ప్రకటించాడు. సొంతంగా పార్టీ పెడతానని ప్రకటించాడు. మరి సొంతంగాపార్టీపెట్టి నడపటం అంటే మాటలు కాదు. సినీ గ్లామరో, డబ్బో, భారీ సంపాదనో, కులమో ఉంటే తప్ప నడిపించడం ఈజీ కాదు. కులం ఇమేజ్ తో మంచి పట్టు కలిగిన మాజీ ఐఏఎస్ అధికారి జేపీ కూడా కొన్నాళ్లు పార్టీని నడిపి ఆపేశాడు. తన కులపోళ్లు గట్టిగా ఉన్న కూకట్ పల్లిలో మాత్రం ఆయన ఎమ్మెల్యేగా ఒక్కసారి నెగ్గగలిగాడు.

రెండో సారి అక్కడ నుంచి పోటీ చేసే ధైర్యమే లేకపోయింది ఆయనకు.ఇలాంటి నేపథ్యంలో లక్ష్మినారాయణ రాజకీయం మొదలుపెట్టాడు. ఇక ఈయన రాజకీయానికి ఏ మేరకు జనాదరణ దక్కుతుందో తెలియదు కానీ.. ఈయన జగన్ వ్యతిరేక ఓటునే పొందుతాడని మాత్రం ఖాయంగా చెప్పవచ్చు. జగన్ వ్యతిరేక ఓటు కోసం ఇప్పటికే టీడీపీ, జనసేనలు ఎదురుచూపుల్లో ఉన్నాయి.

వాటి ఆశలకు గండి కొడుతూ ఇప్పుడు లక్ష్మినారాయణ కూడా కొంత వరకూ ఓట్లను చీల్చేలా ఉన్నాడు. ఈయన సొంతంగాపోటీ చేసినా, తన వాళ్లను ఎక్కడైనా నిలిపినా.. పది ఓట్లను పొందినా అవి జగన్ వ్యతిరేక ఓట్లు, కాపు ఓట్లే అని విశ్లేషకులు అంటున్నారు. ఈయన పార్టీతో తెలుగుదేశానికి, జనసేనకు నష్టమే అని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.