Home రాజకీయాలు కేసీఆర్ కు వాళ్లు మచ్చెమటలు పట్టిస్తున్నారు!

కేసీఆర్ కు వాళ్లు మచ్చెమటలు పట్టిస్తున్నారు!

SHARE

తెలంగాణలో తమ విజయం నల్లేరు మీద నడకే అని తెలంగాణ రాష్ట్ర సమితి మొదటి నుంచి చెబుతూనే ఉంది. ఆ విశ్వాసంతోనే ఆ పార్టీ ముందస్తు ఎన్నికలకు వెళ్లింది. వాస్తవానికి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఇప్పుడే జరగాల్సిన అవసరం లేదని వేరే చెప్పనక్కర్లేదు. దానికి మరి కాస్త సమయం ఉంది. అయితే కేసీఆర్ మాత్రం ముందుగా ఎన్నికలకు వెళ్లాడు. అందుకు కారణం విజయం పట్ల కేసీఆర్ కు గల విశ్వాసమే అనుకోవాలి.

ఇంకా ఏమేం లెక్కలున్నాయో కానీ.. కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు అయితే వెళ్లాడు. మరి ఇప్పుడు మాత్రం తెలంగాణలో టీఆర్ఎస్ కు మరీ నల్లేరు మీద నడక అనే పరిస్థితి కనిపించడం లేదు. విజయం మరీ సులువు కాదని స్పష్టం అవుతూ ఉంది.

అటు వైపు నుంచి మహాకూటమి గట్టిగానే పోరాడుతూ ఉంది. అసలు కథ ఏమిటనేది ఫలితాల వరకూ తేలకపోవచ్చు. ఆ సంగతలా ఉంటే.. ఇప్పుడు కేసీఆర్ కు రెబల్స్ తలపోటు కూడా కొనసాగుతూ ఉంది. దాదాపు పది నియోజకవర్గాల్లో రెబల్స్ పోటీలో నిలిచారు. ఈ విషయంలో తెరాస చాన్నాళ్లుగానే బుజ్జగింపులు చేస్తోంది. కానీ అందుకు ఫలితాలు కనిపించడం లేదు. పోటీలోకి దిగిన రెబల్స్ వెనక్కు తగ్గడం లేదు.

అదేమంటే.. తాము గెలుస్తామని, గెలిచి మళ్లీ టీఆర్ఎస్ లోకి చేరతామని స్వతంత్రులుగా నిలిచిన రెబల్స్ అంటున్నారు. మరి కొందరు మాత్రం వేరే పార్టీల బీ ఫారాలను సంపాదించేసుకుని బరిలోకి నిలిచారు. వీరిని సముదాయించడానికి తెరాస నేతలు పలు ప్రయత్నాలు చేస్తున్నా.. అందుకు ఫలితాలు కనిపించడం లేదు.మరి నామినేషన్ల ఉపసంహరణకు మరో రోజు గడువు ఉంది. ఇలాంటి నేపథ్యంలో అప్పటికైనా రెబల్స్ ను రంగం నుంచి తప్పించగలరో లేదో చూడాలి!