Home రాజకీయాలు తెలంగాణ ఎన్నికల్లో జనసేన.. పవన్ మార్కు కామెడీ!

తెలంగాణ ఎన్నికల్లో జనసేన.. పవన్ మార్కు కామెడీ!

SHARE

తీరా నామినేషన్ల చివరి రోజుకు కానీ.. తెలంగాణ ఎన్నికల విషయంలో స్పందించాలని అనిపించలేదు జనసేనకు. నామినేషన్ల గడువు ముగిసిన తర్వాత.. తాము తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు దూరం అని జనసేన ప్రకటించుకుంది. ఈ తరహా కామెడీలు పవన్ కు కొత్త ఏమీ కావు. అలవాటైనవే.
అసలుకు తెలంగాణ ఎన్నికల విషయంలో బాగా హడావుడి చేసింది జనసేన పార్టీనే. తాము పోటీ చేస్తామని ఇది వరకే ప్రకటించాడు. స్థానాల నంబర్ ను కూడా చెప్పాడు పీకే. అలాగే పొత్తుల ప్రయత్నాలూ చేశాడు. తెలంగాణ సీపీఎం విభాగం వాళ్లు జనసేనతో పొత్తుకు ఉబలాటపడ్డారు. తాము పవన్ తో కలిసి పోటీ చేస్తామని సీపీఎం ప్రకటించింది. ఈ విషయంలో చర్చలు కూడా జరిగాయి.

బహుజన లెఫ్ట్ ఫ్రంట్ లో జనసేన అని హడావుడి చేశారు. పవన్ ను నమ్ముకుని సీపీఎం వాళ్లు మహాకూటమి వైపు కూడా వెళ్లలేదు. తాము జనసేనతో కలిసి వెళ్తామని ఆ పార్టీ ప్రకటించింది. తీరా కట్ చేస్తే.. పవన్ నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరించాడు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ పోటీ చేయడని అప్పట్లోనే అందరికీ అర్థం అయిపోయింది. అందరికీ అర్థం అయిపోయిన విషయాన్ని కొత్తగా ప్రకటించింది జనసేన.

తాము ప్రస్తుతానికి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ప్రకటించింది ఈ పార్టీ. మరి ఈ మాత్రం దానికి ఎన్నికల నామినేషన్ల చివరి రోజు వరకూ వేచి ఉండాల్సిందా!

అయితే లోక్ సభ ఎన్నికల్లో మాత్రం జనసేన పోటీ చేస్తుందట. ఇప్పుడు కూడా ఎన్నికలు కాస్త లేటుగా వచ్చి ఉంటే.. జనసేన పోటీ చేసేదేనట. ముందస్తుగా వచ్చాయి కాబట్టి మాత్రమే చేయలేదట, విన్నే వాళ్లు వెర్రి వాళ్లు అయితే పవన్ కల్యాణ్ కూడా ఇలాంటివి ఎన్నైనా చెప్పగలడు!