Home రాజకీయాలు చంద్రబాబు ఊసు ఎత్తని జూనియర్ ఎన్టీఆర్!

చంద్రబాబు ఊసు ఎత్తని జూనియర్ ఎన్టీఆర్!

SHARE

కూకట్ పల్లి నుంచి పోటీ చేస్తున్న తన సోదరికి నందమూరి తారక్ మద్దతు అయితే ప్రకటించాడు కానీ.. ఇలా మద్దతు ప్రకటిస్తూ అతడు పెట్టిన ట్వీట్ ఆసక్తిదాయకంగా ఉంది. ఒకవైపు సోదరి పోటీని తారక్ స్వాగతించాడు. ఆమెకు ఆల్ ద బెస్ట్ చెప్పాడు. తెలుగుదేశం పార్టీ గురించి పొగిడాడు. అయితే ఎక్కడా చంద్రబాబు ప్రస్తావన తేకపోవడం మాత్రం గమనించాల్సిన విషయం.

‘‘ప్రజలే దేవుళ్లు సమాజమే దేవాలయం అనే సిద్ధాంతంతో తాతయ్య స్వర్గీయ నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ మాకు పవిత్రమైనది. మా నాన్నగారు స్వర్గీయ హరికృష్ణ సేవలందించిన తెదేపా తరఫున ఇప్పుడు మా సోదరి సుహాసిని కూకట్పల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. స్త్రీలు సమాజంలో ఉన్నతమైన పాత్రను పోషించాలి అని నమ్మే కుటుంబం మాది. అదే స్ఫూర్తితో ప్రజాసేవకు సిద్ధపడుతున్న మా సోదరికి విజయం వరించాలని ఆకాంక్షిస్తూ… జై ఎన్టీఆర్, జోహార్ హరికృష్ణ..’’ ఇదీ .జూనియర్ ఎన్టీఆర్ పెట్టిన ట్వీట్.

దీంట్లో స్పష్టం అవుతున్న విషయం ఏమిటంటే.. ఇందులో ఎక్కడా చంద్రబాబు ప్రస్తావన లేదు. తమ తాత ఎన్టీఆర్ స్థాపించిన పార్టీ, తమ తండ్రి హరికృష్ణ సేవలు అందించిన పార్టీ అన్నారు కానీ..ఎక్కడా ఇది చంద్రబాబు నాయకత్వంలోని పార్టీ అని అనలేదు.
చంద్రబాబు నాయకత్వంలో పార్టీని గెలిపించాలని పిలుపునివ్వలేదు. తాత, తండ్రి ప్రస్తావనలతోనే ఆగిపోయారు. ఎక్కడా మామ ప్రస్తావన తీసుకురాలేదు.

ఇదీ కథ. ఒకవైపు సోదరి ఎంట్రీని స్వాగతిస్తూనే మరోవైపు చంద్రబాబుకు ఊసే ఎత్తకుండా తెలివిగా ట్వీటేశాడు జూనియర్ ఎన్టీఆర్.