Home రాజకీయాలు బీజేపీకి స్టార్ హీరో మద్దతు దొరికినట్టేనా!

బీజేపీకి స్టార్ హీరో మద్దతు దొరికినట్టేనా!

SHARE

తమిళనాట భారతీయ జనతా పార్టీకి ఆశలు ఏమీ లేవు. గత ఎన్నికల్లో చాలా పార్టీలను కూటమిగా కలుపుకు వెళ్లి కూడా బీజేపీ పెద్దగా సాధించింది ఏమీ లేదు. అయితే వచ్చే ఎన్నికల్లో మాత్రం తమిళనాట ఏదో సాధించాలని బీజేపీ భావిస్తోంది. జయ మరణం తర్వాత అన్నాడీఎంకే బలహీన పడటం.. ఆ పార్టీ నాయకత్వం బీజేపీ వైపు మొగ్గు చూపడంతో.. అన్నాడీఎంకేతో కమలం పార్టీ పొత్తు ఖరారు అయినట్టే.

ఇక ఇదే సమయంలో బీజేపీకి రజనీకాంత్ కూడా దగ్గరవుతున్న దాఖలాలు కనిపిస్తున్నాయి. రజనీకాంత్ గత నాలుగైదేళ్లుగా బీజేపీ సానుభూతి పరుడిగానే కనిపిస్తున్నాడు. అయితే డైరెక్టుగా బీజేపీకి మద్దతు పలకడం లేదు.

ఇక తాజాగా బీజేపీ పట్ల మరోసారి సానుకూలంగా మాట్లాడాడు సూపర్ స్టార్. బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీలు కూటమిగా కట్టడంపై రజనీ స్పందించాడు. బీజేపీ బలంగా ఉంది కాబట్టే వాళ్లంతా జట్టు కడుతున్నారన్నట్టుగా రజనీ వ్యాఖ్యానించాడు.

ఎలా చూసినా రజనీకాంత్ బీజేపీ సానుభూతి పరుడిగా.. కమలం పార్టీ అనుకూలుడుగానే కనిపిస్తున్నాడు. రేపటి ఎన్నికల్లో బీజేపీ, రజనీకాంత్, అన్నాడీఎంకే కలిసి బరిలోకి దిగవచ్చనే అంచనాలున్నాయి. అయితే అన్నాడీఎంకే ఇప్పటికే వ్యతిరకతను మూటగట్టుకుంది. ఇలాంటి నేపథ్యంలో రజనీ ఆ పార్టీతో జట్టు కడితే ఓట్లు పడతాయా అనేది ప్రశ్నార్థకమే.

ఇక ఈ డిసెంబర్ 12కు అయినా రజనీకాంత్ రాజకీయ పార్టీ పై స్పష్టత రావొచ్చని.. అభిమానులు, మీడియా ఆశిస్తోంది.