Home ప్రత్యేకం జనసేన.. రాజకీయ పార్టీగా ఎప్పుడు మారుతుంది?

జనసేన.. రాజకీయ పార్టీగా ఎప్పుడు మారుతుంది?

SHARE

జనసేన.. కొత్తగా రాజకీయ పార్టీగా మారడం ఏమిటి? రేపో మాపో ఆ పార్టీ ఏపీలో అధికారాన్ని కూడా చేపడుతుంది.. అని అంటారు పవన్ కల్యాణ్ ఫ్యాన్స్. వారు మాత్రమే కాదు.. పవన్ కల్యాణ్ కూడా అదే మాటే చెబుతాడు. తను ఏపీకి కాబోయే ముఖ్యమంత్రిని అని పవన్ చెప్పుకుంటున్నాడు. వేరే ఎవరైనా సీఎం సీటును ఆశించడం తప్పు.. తను మాత్రం సీఎం అయిపోతానని ప్రకటించుకోవచ్చు.. ఇదీ పవన్ కల్యాణ్ తీరు. వేరే వాళ్లకు నీతులు చెప్పే పవన్ కల్యాణ్ తను మాత్రం వాటిని ఆచరించాల్సిన అవసరం లేదన్నట్టుగా మాట్లాడుతూ ఉంటాడు.

ఆ సంగతలా ఉంటే.. జనసేనకు ఇప్పటికీ ఒక రాజకీయ పార్టీ రూపం రాకపోవడం గమనార్హం. ఏపీలో ఎన్నికలకు మరెంతో దూరం లేదు. నవంబర్ ను మినహాయిస్తే మరో నాలుగు నెలల్లో ఏపీలో కూడా ఎన్నికల షెడ్యూల్ వస్తుంది. అటు లోక్ సభ ఎన్నికలకు, ఇటు ఏపీ అసెంబ్లీకి ఎన్నికల షెడ్యూల్ ఒకేసారి వస్తుంది.

ఇలాంటి నేపథ్యంలో.. జనసేన ఇంకా రంగురుచివాసన ఇవేమీ అద్దడం లేదు పవన్ కల్యాణ్. ఇప్పటి వరకూ పవన్ ఏదో ఒంటెత్తు పోకడలతో సభలు, సమావేశాలు పెట్టుకొంటూ పోతున్నాడు. వాటిల్లో ఇష్టానుసారం మాట్లాడుతూ ఉంటాడు. అయితే జనసేనలో ఇప్పటి వరకూ నేతల హడావుడి కనిపించడం లేదు.

175 అసెంబ్లీ సెగ్మెంట్లలో పోటీ చేసేంత మంది అభ్యర్థులు జనసేనలో ఉన్నారా? అనేదానికి సమాధానమే లేదు. పవన్ కల్యాణ్ కనిపిస్తున్నాడు. తోటచంద్రశేఖర్ వంటి మాస్ లో గుర్తింపు కూడా లేని వాళ్లు ఇద్దరుముగ్గురు కనిపిస్తున్నారు. ఆపై నాదెండ్ల మనోహర్. అంతటా అతడే కనిపిస్తూ ఉన్నాడు.
ఒక రాజకీయ పార్టీ అంటే ఇంతేనా? నాలుగు నెలల్లో ఎన్నికలు రాబోతున్న తరుణంలో ఒక పార్టీ ఉండాల్సింది ఇలాగేనా? ఈ మాత్రం దానికే జనసేన అధికారం అందుకుంటుందా? పవన్ సీఎం అవుతాడా? అవేమో కానీ.. ఇలాగే కొనసాగితే జనసేన అసలు ఊసులో కూడా నిలబడదు అని వేరే చెప్పనక్కర్లేదు.