Home ప్రత్యేకం మహాకూటమి మీద కూడా ఆ కులం పట్టు గట్టిగానే!

మహాకూటమి మీద కూడా ఆ కులం పట్టు గట్టిగానే!

SHARE

తెలంగాణ కు ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నట్టుగా ప్రకటిస్తూ.. అసెంబ్లీ రద్దు ప్రతిపాదన చేస్తూ.. తెరాస అధినేత కేసీఆర్ తన అభ్యర్థుల జాబితాను ప్రకటించినప్పుడు అందులో కుల సమీకరణాలకు చాలా మంది ఆశ్చర్యపోయారు. ఏకంగా 35 మంది రెడ్లకు టికెట్లను ఖరారు చేశాడు కేసీఆర్. 119 సీట్లలో 35 సీట్లు కేవలం రెడ్లకే ఇచ్చాడు తెరాస అధినేత. ఆ తర్వాత కూడా మరి కొన్ని సీట్లు రెడ్లకే లభించాయి.

అలా తెరాస అభ్యర్థుల జాబితాలో మూడో వంతు స్థానాన్ని ఆక్రమించారు రెడ్లు. ఈ కులస్తులు గట్టిగా తెరాసకే మద్దతు పలుకుతారని చెప్పడానికి ఏమీ లేదు. అయినా.. కేసీఆర్ మూడో వంతు స్థానాలను రెడ్లకే కేటాయించాడు.

ఇక మహాకూటమి కూడా రెడ్లకు మంచి ప్రాధాన్యతనే ఇస్తోంది. ఇప్పటి వరకూ ఉన్న సమాచారం మేరకు 65 సీట్లకు అభ్యర్థులు ఖరారు అయ్యారు. వారిలో 22 మంది రెడ్లున్నారు. ఇంకా కాంగ్రెస్ పార్టీ.. ముప్పై సీట్లకు పైగా అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. వాటిల్లో కూడా రెడ్లకు గట్టిగానే అవకాశం దక్కే అవకాశం ఉంది.

అలాగే మహాకూటమిలోని తెలుగుదేశం, టీజేఎస్ లు కూడా రెడ్లకు కొన్ని సీట్లను కేటాయించే అవకాశం ఉంది. స్థూలంగా ఈ కూటమి తరఫున కూడా దాదాపు 40 మంది రెడ్లకు అభ్యర్థిత్వం దక్కడం ఖాయమే అని అనుకోవాలి.

అటు తెరాస తరఫు నుంచి నలభై మంది, ఇటు మహాకూటమి నుంచి మరో నలభై మంది రెడ్లు బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మూడో వంతు సీట్ల లో వీళ్లు పాగా వేయవచ్చు.