Home రాజకీయాలు ఒకరికొరు సహకరించుకునే సీట్లు తక్కువే!

ఒకరికొరు సహకరించుకునే సీట్లు తక్కువే!

SHARE

పేరుకు మహాకూటమే కానీ.. ఈ కూటమిలోని పార్టీలు ఒకదానికి మరోటి సహకరించుకునేలా కనిపించడం లేదు. ఈ కూటమిలో సీట్ల సర్దు బాటుకే నెల రోజుల పాటు రచ్చ జరిగింది. ఈ కూటమిలో మెజారిటీ సీట్లు కాంగ్రెస్ కే అని ఇతర పార్టీలు కూడా ఒప్పుకున్నాయి. తెలుగుదేశ తక్కువ సీట్లలో పోటీకే ఓకే చెప్పింది. అలాగే టీజేఎస్, సీపీఐలు కూడా పెద్దగా సీట్లనేమీ డిమాండ్ చేయలేదు.

అయినప్పటికీ సీట్ల చర్చ మాత్రం చాలా కాలం నడిచింది. చివరకు ఎలాగో సీట్ల వ్యవహారాన్ని తెంచుకున్నారు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ప్రకటన చేయడంపై మహాకూటమిలోని టీజేఎస్, సీపీఐలు ఫైర్ అవుతున్నాయి. తాము కోరుకున్న స్థానాలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ప్రకటించిందని వారు మండి పడుతున్నారు.

ఇదైతే నిజమే. తమకు కావాలని టీజేఎస్, సీపీఐలు ఇచ్చిన జాబితాలోని సీట్లకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. దీంతో ఆ పార్టీలు ఫైర్ అవుతున్నాయి. తాము సహకరించం అన్నట్టుగా మాట్లాడుతున్నాయి. ఈ సీట్లలో ఆ పార్టీలు కూడా పోటీకి దిగినా పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.

ఇక కాంగ్రెస్ నిజంగానే త్యాగం చేసిన సీట్లలో ఆ పార్టీ నుంచి అసహనం కనిపిస్తోంది. తెలుగుదేశం, టీజేఎస్, సీపీఐలకు కాంగ్రెస్ పార్టీ కొన్ని సీట్లను ఇచ్చింది. వాటిల్లో కాంగ్రెస్ నేతలు రచ్చ చేస్తున్నారు. టికెట్ తమకే కావాలని.. టీడీపీ లేదా టీజేఎస్ విజయానికి సహకరించేదే లేదని వారు అంటున్నారు. కాంగ్రెస్ త్యాగం చేసిన నియోజకవర్గాల్లో రెబల్స్ రంగంలోకి దిగడం ఖాయమని తెలుస్తోంది.

ఇక టీడీపీలోనూ కొన్ని చోట్ల అంతర్గత కుమ్ములాటలు కనిపిస్తున్నాయి..మరి కొన్ని చోట్ల.. వేరే పార్టీ కి సహకరించం అనే మాటలు వినిపిస్తున్నాయి. ఇలా మహాకూటమిలో రచ్చ కొనసాగుతూ ఉంది. మరి కూటమిలోని పార్టీలు ఒకటికి మరొకటి సహకరించుకునేది ఎక్కడ అనేది ప్రశ్నార్థకం!