Home రాజకీయాలు మహాకూటమి…ఇంకా ఆశలున్నాయా?

మహాకూటమి…ఇంకా ఆశలున్నాయా?

SHARE

ఒకవైపు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. కానీ..ఇప్పటికీ మహాకూటమి సీట్ల లెక్కలు మాత్రం తేలడం లేదు. ప్రస్తుతం కూటమి నేతలంతా ఢిల్లీ బాట పట్టారు. అక్కడ కాంగ్రెస్ అధిష్టానం పెద్దల సమక్షంలో చర్చలు సాగుతూ ఉన్నాయని సమాచారం.

మరి ఈ రోజు కూడా మహాకూటమిలో సీట్ల లెక్కలు ఒక కొలిక్కి రాకపోతే..అంతే సంగతులు. ఎందుకంటే.. ఈ రోజుతో నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. మరో వారం రోజుల పాటు నామినేషన్లు సాగుతాయి. వచ్చే శనివారం లోగా నామినేషన్లు దాఖలు చేయాల్సిందే. ఆదివారం సెలవు. సోమవారం తుదిగడువు.

ఇప్పటి ఈ పార్టీల్లో ఎవరికి ఎన్ని సీట్లు అనే అంశం మీదే క్లారిటీ రావడం లేదు. క్లారిటీ వచ్చిందని మొదట ప్రకటించుకున్నారు. తర్వాత కథ అడ్డం తిరిగింది.ఒకటీ రెండు సీట్ల వద్ద ఈ పార్టీలు రచ్చలు చేసుకుంటున్నాయి. మరి సీట్ల నంబర్లు తేలడానికే ఇంత కష్టం అయితే.. ఏ సీటు ఎవరికో తేలేది మరెప్పుడు?

అంతజేసీ..సోమవారంలోగా నామినేషన్లన్నీ పడిపోవాలి. ఒకరికి ఒకరు సహకరించుకోవాలి. అయితే మహాకూటమిలో అలాంటి సయోధ్య కుదురుతుందా? అనేది ప్రశ్నార్థకంగానే మిగిలింది.

కార్యకర్తల్లో ఈ కూటమి కన్ఫ్యూజన్ ఉంది. కూటమిలోని ఇతర పార్టీలతో కార్యకర్తలంతా కలిసి పోతారా? అనేది సందేహమే. అవతల కొన్ని సీట్ల విషయంలో ఇప్పటికే రచ్చలు మొదలయ్యాయి. మరో పార్టీకి ఆ సీట్లను కేటాయిస్తే సహించమని..ఆయా పార్టీల కార్యకర్తలు ప్రకటించుకుంటున్నారు. మరి ఇన్ని చిక్కుముడుల మధ్యన మహాకూటమి రాణించగలుగుతుందా?