Home ప్రత్యేకం జనం నుంచి జగన్‌ను వేరు చేయలేరు.. జగన్ ఇక మీ బిడ్డ జాగ్రత్తగా చూసుకోండి: విజయమ్మ

జనం నుంచి జగన్‌ను వేరు చేయలేరు.. జగన్ ఇక మీ బిడ్డ జాగ్రత్తగా చూసుకోండి: విజయమ్మ

SHARE

నిరంతరం ప్రజల కోసమే పాటుపడుతున్న తన కుమారుడు వైఎస్‌ జగన్‌ను జనం నుంచి వేరు చేయలేరని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ తెలిపారు. విశాఖ విమానాశ్రయంలో గత నెల 25వ తేదీన జగన్‌పై హత్యాయత్నం జరిగాక హైదరాబాద్‌లో చికిత్స అనంతరం విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించడంతో పాదయాత్రకు విరామం ప్రకటించిన విషయం తెలిసిందే. 17 రోజుల విరామం అనంతరం వైఎస్‌ జగన్‌ సోమవారం నుంచి ప్రజాసంకల్పయాత్రను పునఃప్రారంభించబోతున్నారు.

జగన్ కు ఇక ప్రజలే అండగా నిలవాలని వైఎస్ విజయమ్మ కోరారు. నేడు మీడియా సమావేశంలో మాట్లాడుతున్న వేళ, హత్యాయత్నాన్ని గుర్తు చేసుకుని ఆమె భావోద్వేగానికి గురయ్యారు. జగన్ ఇక మీ బిడ్డని, మీ మధ్యకే వస్తున్నాడని, జాగ్రత్తగా చూసుకోవాలని ప్రజలను ఉద్దేశించి ఆమె కోరారు.

నేడు జగన్ తిరిగి విజయనగరానికి బయలుదేరుతున్నాడని గుర్తు చేసిన ఆమె, “జగన్ జనం కోసం వెళుతున్నాడు. రాజశేఖరరెడ్డి గారు ఎప్పుడూ చెప్పేవారు. కొనసాగించడం… స్టార్ట్ చేసిన పనిని మధ్యలో ఆపకూడదు. నాయకుడి లక్షణమే అదని. జగన్ కూడా అదే లక్షణాన్ని కలిగున్నాడు. తను పాదయాత్రకు వెళుతున్నాడు. నాడు ఎలాగైతే మీ చేతికి అప్పగించానో, నేడు మరలా అదే పని చేస్తున్నాను.

ఒకటి మాత్రమే నేను చేయగలను. జగన్ క్షేమం కోసం ప్రార్థన చేయగలను. భరోసా ఇవ్వాల్సింది, మాట ఇవ్వాల్సింది మీరే. నేను రెండు చేతులూ ఎత్తి విజ్ఞప్తి చేస్తున్నా. నా కొడుకును కాపాడండి. ఆశీర్వదించండి” అని ఆమె కోరారు.