Home రాజకీయాలు చిరంజీవి.. సందడిలో సడేమియా!

చిరంజీవి.. సందడిలో సడేమియా!

SHARE

తమ్ముడు పెట్టిన జనసేన పార్టీపై చిరంజీవికి చాన్నాళ్లుగానే మనసు లాగుతూ ఉంది. ఒకవైపు జనసేన వాళ్లేమో ఈ పార్టీకి చిరంజీవికి సంబంధం లేదని అంటారు. వాళ్లు అలా అనడం వ్యూహాత్మకమే. చిరంజీవి పేరు చెబితే జనాలకు ప్రజారాజ్యం గుర్తుకు వస్తుంది.. అప్పుడు పడే ఓట్లు కూడా పడవు అనే భయం ఉంది జనసేన వర్గాల్లో, అందుకే చాన్నాళ్ల పాటు ఈ పార్టీతో చిరంజీవికి సంబంధం లేదని చెప్పుకొచ్చారు.

అయితే ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో లెక్కలు మారిపోతూ ఉన్నాయి. చిరంజీవి ఫ్యామిలీ ఇప్పటికే జనసేన అయిపోయింది. ఇక చిరంజీవి ఈ పార్టీ సభ్యత్వాన్ని తీసుకోవడమే ఆలస్యం.

ఎన్నికల సమయానికి చిరు జనసేన నేత అవుతాడనేది బాగా వినిపిస్తున్న మాట. ఇప్పటికే చిరంజీవి కాంగ్రెస్ కార్యకలాపాలకు బాగా దూరం అయ్యాడు. ఇటీవలే చిరంజీవి కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ కాలం ముగిసిందని, ఇక చిరంజీవి దాన్ని కొనసాగించడని కూడా వార్తలు వచ్చాయి.

ఇక చిరంజీవి కాంగ్రెస్ పార్టీకి అధికారికంగా దూరం కావడమే మిగిలింది. అది కూడా అతి త్వరలోనే జరగబోతోందని సమాచారం. ప్రస్తుత పరిణామాలను వాడుకొంటూ మెగాస్టార్ సందడిలో సడేమియాగా కాంగ్రెస్ నుంచి బయటకు రావొచ్చని తెలుస్తోంది.

కాంగ్రెస్ పార్టీ, టీడీపీలు చేతులు కలిపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చిరంజీవి కాంగ్రెస్ కు రాజీనామా చేస్తాడని తెలుస్తోంది. టీడీపీతో కాంగ్రెస్ చేతులు కలపడాన్ని నిరసిస్తూ తను ఆ పార్టీని వీడుతున్నట్టుగా చిరంజీవి నుంచి ప్రకటన రానున్నదని సమాచారం. ఇక చిరు జనసేనలోకి చేరడం కూడా లాంఛనమే అవుతుందని విశ్లేషకులు అంటున్నారు.