Home రాజకీయాలు చంద్రబాబు భ్రమలో ఉన్నాడా.. భ్రమలు కల్పించాలనా?

చంద్రబాబు భ్రమలో ఉన్నాడా.. భ్రమలు కల్పించాలనా?

SHARE

మొన్నటి వరకూ బీజేపీతో కాపురం చేశాడు. అంతకు ముందంతా బీజేపీతో జతకట్టే ప్రసక్తే లేదని చంద్రబాబు అనేక సార్లు వ్యాఖ్యానించాడు. జగన్ పార్టీ పెట్టి ఉప ఎన్నికలను ఎదుర్కొన్నప్పుడు జగన్ కు బీజేపీ కి సంబంధం ఉందని ప్రచారం చేశాడు చంద్రబాబు. తీరా గత ఎన్నికల్లో బీజేపీతో తనే ముందుగా పొత్తు పెట్టుకున్నాడు. ఇక నాలుగేళ్ల పాటు బీజేపీతో కలిసి సాగాడు.

కమలం పార్టీతో బాబు వేసిన వేషాలు అన్నీ ఇన్నీ కావు. బీజేపీ రాష్ట్రానికి ఎన్నో మేళ్లు చేస్తోందని బాబు చెప్పుకొచ్చాడు.ఏపీకి ప్రత్యేక హోదా అవసరంలేదు అని, బీజేపీ అంతకు మించిన ప్యాకేజీ ఇచ్చిందని మోడీకి ఏపీ అసెంబ్లీలో ధన్యవాద తీర్మానాన్ని పెట్టింది కూడా బాబే. అంతేకాదు.. ఎన్డీయే మీటింగ్ జరిగితే దానికి కూడా వెళ్లి మోడీ మళ్లీ ప్రధాని కావాలని చంద్రబాబు నాయుడు తీర్మానం చేశాడు.

అయితే ఇప్పుడు బాబు లెక్కలు మారిపోయాయి. మోడీతో ఎందుకు చెడిందో కానీ.. ఇప్పుడు కాంగ్రెస్ తో చేతులు కలిపేశాడు చంద్రబాబు. ఇక ఇప్పుడు బాబుగారి వేషాలు అన్నీ ఇన్నీ కావు.

అందులోనూ.. బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేసింది తనే అన్నట్టుగాగా బాబు బిల్డప్ ఇస్తున్నాడు. వాస్తవానికి యూపీఏ అనేది ముందు నుంచి ఉంది. అది బీజేపీ వ్యతిరేక కూటమిగా వ్యవహరిస్తూ వచ్చింది. దాంట్లోకి ఇప్పుడు చంద్రబాబు నాయుడు చేరాడు. ఆ కూటమిలో కొన్ని పార్టీలున్నాయి. వాటి పంచన చేరాడు చంద్రబాబు.

అయితే బాబుగారి కలరింగ్ మాత్రం మరోలా ఉంది. అదేమిటంటే.. బీజేపీ వ్యతిరేక కూటమిని తనే ఏర్పాటు చేశాను అన్నట్టుగా బాబు బిల్డప్ ఇస్తున్నాడు. ఆ కూటమిలో తను చేరడం కాదు.. తన వల్లనే ఆ కూటమి ఏర్పడిందన్నట్టుగా బాబు కలరింగ్ ఇస్తున్నాడు. మరి చంద్రబాబు భ్రమలో ఉన్నాడో లేక అందరినీ ఇదే విధంగా భ్రమను కల్పించాలని చూస్తున్నాడో మరి.