Home రాజకీయాలు మహాకూటమిలో సీట్ల లొల్లి.. తెగేలా లేదిక!

మహాకూటమిలో సీట్ల లొల్లి.. తెగేలా లేదిక!

SHARE

తెలంగాణ ఎన్నికల్లో కేసీఆర్ ను కట్టడి చేయడానికి మహాకూటమిని ఏర్పాటు అయితే చేశారు కానీ.. ఇప్పటి వరకూ సీట్ల డీల్ తేలడం లేదు. ఇక నామినేషన్లకు ముహూర్తం దగ్గరపడుతున్నా కూటమిలో సీట్ల లెక్కలు తేలడం లేదు. సీట్ల లెక్కలు తేలడం ఒక ఎత్తు అయితే.. సీట్ల సంఖ్య తేలాకే అసలు సంగతి మొదలవుతుంది. ఈ కూటమిలోని పార్టీల మధ్యన సీట్ల నంబర్ విషయంలో డీల్ సెట్ అయినా.. ఏ సీటు ఎవరికి? అనేది మాత్రం తేలడం ఈజీ కాదు.

ఎందుకంటే.. చాలా సీట్ల మీద అన్ని పార్టీల కన్నూ ఉంది. తెరాస ఎక్కడైతే బలహీనంగా అనిపిస్తోందో అక్కడంతా పోటీకి ఈ కూటమిలోని పార్టీలు మొగ్గుచూపుతున్నాయి. తెరాస బలంగా ఉన్న సీట్లో పోటీ పట్ల మహాకూటమిటో పెద్ద పోటీ లేదు. ఎక్కడైతే తెరాస బలహీనంగా ఉందో ఆ సీట్ల విషయంలో మాత్రం కూటమిలోని పార్టీలో పోటీ పడుతున్నాయి. అక్కడ పోటీ తామంటే తాము అంటున్నాయి.

ఇలాంటి సీట్ల సంఖ్య చాలానే ఉందని తెలుస్తోంది. గ్రేటర్ పరిధిలోని సీట్ల విషయంలోనే ఈ పార్టీల మధ్య రచ్చ పతాక స్థాయిలో ఉండబోతోందని సమాచారం. ఈ సీట్లు తమకు కావాలని.. గత ఎన్నికల్లో తాము గెలిచామని టీడీపీ అంటోంది. అయితే కాంగ్రెస్ నుంచి త్యాగధనులు కనిపించడం లేదు. ఈ సీట్లలో కాంగ్రెస్ తరఫున ఆశావహులు తమ ప్రచారంలో తాము నిమగ్నమయ్యారు. వెనక్కు తగ్గేదిలేదని వారు అంటున్నారు.

గ్రేటర్ లో తెరాస బలహీనంగా ఉన్న సీట్లలో అటు టీడీపీ అభ్యర్థులు, ఇటు కాంగ్రెస్ అభ్యర్థులు ఎవరికి వారుగా ప్రచారం చేసుకుంటున్నారు. మరి పొత్తుతో ఎవరో ఒకరికే ఈ సీట్లు వస్తే మిగతా వాళ్లు త్యాగం చేస్తారా? లేక ఢీ అంటే ఢీ అంటారో చూడాల్సి ఉంది!