Home ప్రత్యేకం జగన్ పై హత్యాయత్నం: కేంద్రం విచారణ మొదలు?

జగన్ పై హత్యాయత్నం: కేంద్రం విచారణ మొదలు?

SHARE

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి పై జరిగిన హత్యాయత్నం పై కేంద్ర ప్రభుత్వ విచారణ జరగనుందా? ఈ అంశంపై విచారణకు కేంద్ర హోం శాఖ ఆదేశిస్తుందా? అదే జరిగితే అంతకు మించిన సంచలనం ఉండదు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత పై జరిగింది అల్లాటప్పా దాడి ఏమీ కాదని, జగన్ ను హతమొందించాలని శ్రీనివాసరావు అనే నిందితుడు అనుకున్నాడని రిమాండ్ రిపోర్టుతో స్పష్టం అవుతూ ఉంది.

తాజాగా ఈ అంశంపై ఢిల్లీ వెళ్లి కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను కలిశారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు. జగన్ పై జరిగిన హత్యాయత్నం విషయాన్ని వారు ఆయనకు వివరించారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ తీరును వివరించి.. చంద్రబాబు ప్రభుత్వ విచారణ మీద తమకు నమ్మకం లేదని.. కేంద్ర ధర్యాప్తు సంస్థతో ఈ విషయంపై విచారణ చేయించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు కోరారు.

తమ డిమాండ్ పట్ల కేంద్ర హోం శాఖ మంత్రి సానుకూలంగా స్పందించారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రకటించారు. అయితే కేంద్రం ఈ అంశంపై విచారణకు ఆదేశిస్తుందా? అనే అంశంపై ఇంకా స్పష్టత లేదు. ఒకవేళ ఆదేశిస్తే జగన్ పై హత్యాయత్నంలో కుట్ర కోణం చర్చనీయాంశం అవుతుంది.

ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తోందో తెలిసిందే. ఇది జగన్ అభిమాని పని, కేంద్రం పని అని, జగన్ మీద జగనే చేయించుకున్న అటాక్ అని.. ఇలా రకరకాలుగా మాట్లాడారు పచ్చ పార్టీ నేతలు. ఇక విచారణ అవసరమే లేదన్నట్టుగా మాట్లాడేస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో గనుక కేంద్ర ప్రభుత్వం ఈ వ్యవహారంపై విచారణ చేయిస్తే.. అసలు కథలు బయటకు వచ్చే అవకాశం ఉంది!