Home రాజకీయాలు వాస్తవాలు కాదు.. టీడీపీది అంతా రాజకీయమే!

వాస్తవాలు కాదు.. టీడీపీది అంతా రాజకీయమే!

SHARE

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి పై జరిగిన హత్యాయత్నం విషయంలో తెలుగుదేశం పార్టీ రాజకీయమే చేస్తోంది తప్ప.. వాస్తవాలను మాత్రం బయట పెట్టే ప్రయత్నం చేయడం లేదు. జగన్ పై హత్యాయత్నం గురించి ప్రభుత్వం స్పందిస్తున్న తీరు మొదటి నుంచి సందేహంగానే ఉంది. జగన్ మీద హత్యాయత్నం జరిగిన వెంటనే.. అది జగన్ అభిమానే చేశాడనే పాటను మొదలుపెట్టారు. అతడికి జగన్ అభిమాని అనే ముద్రను వేయడానికి ప్రభుత్వ వ్యవస్థ అంతా ప్రయత్నం చేసింది.

ఎలాగోలా అతడు జగన్ అభిమాని అని ముద్ర వేయడానికే ప్రయత్నించారు కానీ.. ఆ సమయంలో అసలు విచారణ మాత్రం జరగలేదు. ఇక లేఖ ఉన్నట్టుండి బయటకు రావడం, అంత పెనుగులాటలో కూడా ఆ లేఖ ఏమీ నలగకపోవడం.. ఇదంతా అనేక సందేహాలకు తావిచ్చింది. ఇక ఇప్పుడు తెలుగుదేశం వాళ్లు ఈ అంశాన్ని రెండు రకాలుగా ఉపయోగించుకోవాలని అనుకుంటున్నారు.

ఒకటి కేంద్ర ప్రభుత్వ కుట్ర అని అనడం, రెండు జగన్ ఇదంతా చేయించుకున్నాడు అని చెప్పడం.. మంత్రులు, ముఖ్యమంత్రి, నారా లోకేష్.. అంతా ఇదే మాటే చెబుతున్నారు. మరి నిజంగానే జగన్ స్వయంగా ఇలా చేయించుకుని ఉంటే, సానుభూతి పొందే ప్రయత్నం చేసి ఉంటే.. ఏపీ ప్రభుత్వానికి అది నిరూపించడం పెద్ద కథ ఏమీ కాదు.

ఈ అంశంపై విచారణ చేయించవచ్చు. కానీ అది చేయడం లేదు. ఎంతసేపూ జగన్ మీద బురదజల్లడం, కేంద్ర ప్రభుత్వ కుట్ర అని అనడం.. తమ రాజకీయం చేయడమే కానీ.. తెలుగుదేశం పార్టీ ఈ సంఘటన మీద విచారణకు ఆదేశించాం.. అసలు విషయాన్ని బయటపెడతాం అనడం లేదు. అనుకూల మీడియా ఎలాగూ ఉంది కాబట్టి.. ఈ ఘటనలోని అసలు కుట్ర కోణాన్ని బయటకు రానీయకుండా తెలుగుదేశం పార్టీ వ్యవహరిస్తోందని స్పష్టం అవుతోంది.