Home ప్రత్యేకం ఢిల్లీ టూర్.. జగన్ పై హత్యాయత్నాన్ని దారి మళ్లించే యత్నం!

ఢిల్లీ టూర్.. జగన్ పై హత్యాయత్నాన్ని దారి మళ్లించే యత్నం!

SHARE

తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఉన్నఫలంగా ఢిల్లీ చేరుకున్నాడు. ప్రెస్ మీట్ కోసం ప్రజల సొమ్ముతో ప్రత్యేక విమానం వేసుకుని బాబు ఢిల్లీ చేరాడు. అదేమిటంటే.. ఇప్పుడు బాబు గవర్నర్ వ్యవస్థపై పోరాటాన్ని మొదలుపెట్టాడట. ఏపీలో గవర్నర్ ను అడ్డం పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందని, తన ప్రభుత్వాన్ని దించేసే యత్నం చేస్తోందని, ఇలాంటి గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలని తాము ఎప్పటి నుంచినో చెబుతున్నామని చంద్రబాబు అంటున్నాడు.

అయినా గవర్నర్ వ్యవస్థను భ్రష్టు పట్టించడంలో చంద్రబాబు పాత్ర ఏమీ తక్కువ కాదు. ఎన్టీఆర్ నుంచి అధికారం లాక్కున్న సమయంలో గవర్నర్ సహకారం లేకపోతే చంద్రబాబుకు పదవి దక్కేదా? అంత వరకూ ఎందుకు మొన్న ఓటుకు నోటు కేసులో చిక్కుకున్నప్పుడు చంద్రబాబుకు కేసీఆర్ కు పంచాయితీచేసింది కూడా గవర్నరే కదా. అయితే అప్పుడంతా గవర్నర్ తో చంద్రబాబుకు అవసరం.

అయితే ఇప్పుడు లేదు. అందుకే..గవర్నర్ కేంద్ర ప్రభుత్వ ఏజెంట్అని బాబుకు అనిపిస్తోంది. అందులో భాగంగా గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలని అంటున్నాడు. ఇదంతా చంద్రబాబు నాయుడు ఎందుకు చేస్తున్నాడో చెప్పనక్కర్లేదు. తన రాష్ట్రంలో ప్రతిపక్ష నేత మీద హత్యాయత్నం జరిగింది. తద్వారా ఇక్కడ పాలన ఎలా ఉందో స్పష్టం అవుతోంది.

ఈ హత్యాయత్నం విషయంలో నిఖార్సైన విచారణ లేదు. జరిగిందేమిటో స్పష్టంగా చెబుతున్నది లేదు. అయితే చంద్రబాబు మాత్రం ఉన్న ఫలంగా గవర్నర్ మీద పడ్డాడు. జగన్ పై హత్యాయత్నం అనంతరం గవర్నర్ ఏపీ డీజీపీకి ఫోన్ చేశాడని..అదే దోషమని బాబు అంటున్నాడు. ఆ విషయాన్ని అడ్డం పెట్టుకుని రచ్చ రాజేస్తున్నాడు. ఇదంతా జగన్ పై హత్యాయత్నం విషయాన్ని డైవర్ట్ చేయడానికి చంద్రబాబు నాయుడు వేస్తున్న ఎత్తుగడ అని స్పష్టం అవుతోంది.