Home రాజకీయాలు బాబుపై నమ్మకం లేదు, కేంద్ర విచారణ కోరతాం!

బాబుపై నమ్మకం లేదు, కేంద్ర విచారణ కోరతాం!

SHARE

తమ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి పై హత్యాయత్నం విషయంలో చంద్రబాబు నాయుడు వాదనతో ఏకీభవించమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసింది. జగన్ పై జరిగింది దాడి కాదని.. ఇది ముమ్మాటికీ హత్యాయత్నమే అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు అన్నారు. ఈ విషయంలో ఏపీ డీజీపీ ప్రకటనను, ఏపీ ముఖ్యమంత్రి, మంత్రుల తీరును వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్రంగా తప్పు పట్టారు.

ఈ మేరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు మేకపాటి రాజమోహన్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డిలు స్పందించారు. జగన్ ను హత్య చేయడానికి కుట్ర జరిగిందని.. ఈ విషయంపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించకుండా ఏపీ ప్రభుత్వం డైవర్ట్ చేయడానికి ప్రయత్నిస్తోందని వారు మండిపడ్డారు. ఘటన జరిగిన వెంటనే.. నిందితుడు వైసీపీ సానుభూతి పరుడు అంటూ డీజీపీ వాదన మొదలుపెట్టాడని.. అలా కేసును నీరుగార్చే ప్రయత్నం మొదలైందని వారు అన్నారు.

ఆ తర్వాత ముఖ్యమంత్రి స్పందించిన తీరు, మంత్రులు స్పందించిన తీరు మరింత హేయమని వారు అన్నారు. ఘటనపై నిస్పాక్షిక విచారణ జరుగుతుంది, రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో విచారణ చేయిస్తుందనే నమ్మకం తమకు లేదని వైసీపీ నేతలు అన్నారు. అందుకే ఈ విషయంలో తాము సరైన విచారణను కోరుకుంటున్నామని.. దీనిపై కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదిస్తామని వైసీపీ నేతలు ప్రకటించారు.

జగన్ పై జరిగింది ముమ్మాటికీ హత్యాయత్నమే అని, అయితే కుట్ర కోణాన్ని ఏపీ ప్రభుత్వం దాచేయాలని చూస్తోందని.. అందుకే దీనిపై విచారణను కోరుతూ కోర్టును ఆశ్రయిస్తామని వైసీపీ నేతలు ప్రకటించారు. ఈ వ్యవహారాన్ని ఇంతటితో వదిలేది లేదని స్పష్టం చేశారు.