Home రాజకీయాలు యూపీలో పవన్ .. ఏదో చేద్దామని అనుకుంటే, మరేదో!

యూపీలో పవన్ .. ఏదో చేద్దామని అనుకుంటే, మరేదో!

SHARE

యూపీ పర్యటనకు వెళ్లాడు జనసేన అధినేత పవన్ కల్యాణ్. అక్కడ పవన్ కల్యాణ్ బీఎస్పీతో దోస్తీకి ప్రయత్నాలు సాగిస్తాడని ముందుగానే వార్తలు వచ్చాయి. దళిత ఓటు బ్యాంకును లక్ష్యంగా చేసుకుని పవన్ కల్యాణ్ ఈ ప్రయత్నం చేస్తున్నాడని అన్నారు. ఏపీలో బీఎస్పీ గురించి ఎవరికి తెలియదు, మాయావతి ఏపీ సాధారణ ప్రజానీకానికి పరిచయం ఉన్న నేత ఏమీ కాదు. అయితే పవన్ ఏవో ప్రయత్నాలు చేస్తున్నాడని అంతా అనుకున్నారు.

కాపు, దళిత ఓటు బ్యాంకును పవన్ ఏకంగా చేసుకోవాలని అనుకుంటున్నాడని కూడా జనసేన సానుభూతి పరులు విశ్లేషించారు. అయితే బీఎస్పీని, మాయవతిని చూసి ఏపీలో ఓట్లేసే దళితులు ఉంటారా? అనేది ప్రశ్నార్థకం. ఆ సంగతలా ఉంటే.. యూపీ వరకూ వెళ్లినా పవన్ కల్యాణ్ కు అక్కడ బీఎస్పీ అధినేత్రి మాయ దర్శనం కానీ, ఆ పార్టీ ముఖ్యనేతలతో సమావేశం కానీ కుదరలేదు అని తెలుస్తోంది.

దీంతో చేసేది లేక పవన్ కల్యాణ్ బ్యాచ్ తిరుగుముఖం పట్టిందని సమాచారం. ముందస్తుగా అపాయింట్ కోరి వెళ్లారో లేక కోరకుండానే అక్కడకు చేరుకున్నారో కానీ.. మాయవతిని మాత్రం వీరు మీట్ కాలేకపోయారని తెలుస్తోంది. మాయను కలవలేకపోయినా కనీసం బీఎస్పీ నంబర్ టూ స్థాయి నేతలతో అయినా పవన్ కల్యాణ్ సమావేశం అయ్యాడా అంటే అదీ లేదని తెలుస్తోంది. వెళ్లడం అక్కడ అంబేద్కర్ పార్కులో కాసేపు ఉండటం తిరిగి రావడం జరిగిందని సమాచారం.

పవన్ కల్యాణ్ వెళ్లంగానే మాయవతి రారమ్మని అపాయింట్ మెంట్ ఇచ్చేస్తుందని అనుకున్నారో, గ్రాండ్ ఏర్పాట్లు ఉంటాయని అనుకున్నారో కానీ అవేమీ జరిగినట్టుగా లేవు. వెళ్లడం రావడం జరిగింది. అంబేద్కర్ పార్కుకు వెళ్లడాన్ని మాత్రం తమ రాజకీయ ప్రచారానికి బాగానే వాడుకుంటున్నారు. ఇదీ జనసేన అధినేత యూపీ పర్యటన అప్‌డేట్స్!