Home రాజకీయాలు జగన్ పై హత్యాయత్నం.. తప్పుడు వాదనలతో టీడీపీ!

జగన్ పై హత్యాయత్నం.. తప్పుడు వాదనలతో టీడీపీ!

SHARE

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి పై జరిగిన దాడి అత్యంత తీవ్రమైనది. ఇక్కడ అగంతకుడి ఉద్దేశం తీవ్రమైనదని స్పష్టం అవుతోంది. అతడు జగన్ ను హతమార్చాలనే చూశాడు. ప్రత్యక్ష సాక్షులు చెబుతున్న దాని ప్రకారం.. అతడు జగన్ గుండెల మీద గుచ్చాలనే ప్రయత్నించాడు. అయితే అదే సమయంలో జగన్ పక్కకు తిరగడంతో కత్తి భుజానికి గుచ్చుకుంది.

అయితే ఈ కత్తి ద్వారా విషప్రయోగం జరిగిందా? అనే సందేహాలు కూడా కలుగుతున్నాయి. కత్తికి విషం పట్టించి జగన్ మీద హత్యాయత్నానికి తెగబడ్డారా? అనే సందేహాలు కలుగుతున్నాయి. వైద్య నివేదికలే ఈ సందేహాలను తీర్చాలి.

ఆ సంగతలా ఉంటే..ఈ హత్యాయత్నం వార్తను డైల్యూట్ చేయడానికి తెలుగుదేశం పార్టీ తన స్టైల్ రాజకీయం మొదలుపెట్టింది. తెలుగుదేశం నేతలు తలా ఒక వాదన వినిపిస్తున్నారు. ఇందులో ప్రభుత్వ వైఫల్యం లేదు, తెలుగుదేశం ప్రమేయం లేదు అని చెప్పుకోవడానికి వీళ్లు నోటికి వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. ఈ సంఘటనపై బాధ్యతాయుతంగా స్పందించాల్సిన రాష్ట్ర డీజీపీ దారుణంగా మాట్లాడాడు. జగన్ అభిమానే ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు అని డీజీపీ తేల్చేసినట్టుగా మాట్లాడాడు.

అయితే.. ఏ అభిమాని అయినా ఇలా చేస్తాడా? నిజంగానే అభిమాని అయితే చేస్తాడా? అనేది కామన్ సెన్స్. ఇక అంతలోనే ఫ్లెక్సీలను క్రియేట్ చేశారు. వాటిని మీడియాకు అందించారు. తమ సొంత మీడియా ద్వారా తెలుగుదేశం పార్టీ దాన్ని హైలెట్ చేయ ప్రయత్నించింది. అయితే ఇది కూడా డొల్లవాదనగానే మిగిలిపోయింది.

ఇంతలోనే సంఘటన విమానాశ్రయంలో జరిగింది కాబట్టి.. కేంద్ర ప్రభుత్వానిదే బాధ్యత అని అంటున్నారు. కేంద్ర ప్రభుత్వ కుట్ర అని అంటున్నారు. ఇక ఆపరేషన్ గరుడ అని కూడా అన్నారు. ఇలా ఏది తోచితే దాన్ని మాట్లాడుతున్నారు పచ్చ పార్టీ వాళ్లు. అయితే వీళ్లు ఏం మాట్లాడినా అదంతా డొల్ల అని స్పష్టం అవుతోంది.