Home ప్రత్యేకం పవన్ రేటెంతో టీడీపీ చెప్పొచ్చుగా..!

పవన్ రేటెంతో టీడీపీ చెప్పొచ్చుగా..!

SHARE

తెలుగుదేశం పార్టీ పవన్ కల్యాణ్ మీద విరుచుకుపడుతూ ఉంది. పవన్ కల్యాణ్ కు ఏమీ తెలియదు, అవగాహన లేదు, స్థిమితం ఉండదు.. అంటూ మొదలుపెట్టి.. రకరకాలుగా టీడీపీ విమర్శలు చేస్తోంది. మరి ఇదే పవన్ కల్యాణ్ తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్నంత సేపూ, టీడీపీతో కలిసి ఉన్నంత సేపూ అతడి అవగాహన రాహిత్యం, స్థిమితం లేని తనం.. ఇదంతా తెలుగుదేశం పార్టీకి అర్థం కాలేదేమో. ఇప్పుడేమో పవన్ కు ఏమీ తెలియదని పచ్చ పార్టీ నేతలు చెబుతున్నారు.

ఇక మరో విషయం ఏమిటంటే.. పవన్ కల్యాణ్ అమ్ముడు పోయే టైపు అని కూడా టీడీపీ అంటోంది. పవన్ కల్యాణ్ ది ప్రీ పెయిడ్ పార్టీ అని టీడీపీ మంత్రులు అంటున్నారు. గతంలో చిరంజీవి పార్టీని పెట్టి ఎన్నికల తర్వాత దాన్ని అమ్మేశాడని, కాంగ్రెస్ లో విలీనం చేసి డబ్బులు తీసుకున్నాడని, ఇప్పుడు పవన్ కల్యాణ్ పార్టీని పెట్టి అమ్ముకుంటున్నాడని పచ్చ పార్టీ నేతలు, మంత్రులు చెబుతున్నారు.

మరి వీళ్లు చెప్పిన మాట నిజమే అనుకుందాం. కాబట్టి వీళ్లు ఇప్పుడు ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. మొన్నటి ఎన్నికల ముందు పవన్ కల్యాణ్ తెలుగుదేశం పార్టీకే మద్దతు పలికాడు కదా.. అప్పుడు జనసేన అధినేతకు టీడీపీ ఎంత ఇచ్చింది? పవన్ కల్యాణ్ ది ప్రీ పెయిడ్ పార్టీ అంటున్నారు కదా.. ఎంత పేమెంట్ ఇచ్చి మొన్నటి ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీ జనసేన మద్దతును పొందింది?

అప్పుడు పవన్ కల్యాణ్ రేటెంత? ఎంత ఇచ్చి వీధివీధీ ఎన్నికల ప్రచారానికి తిప్పుకున్నారు? వంటి అంశాల మీద తెలుగుదేశం క్లారిటీ ఇవ్వాలి. అప్పుడు పవన్ కల్యాణ్ ఎంతకు అమ్ముడుపోయాడో అర్థం అవుతుంది. అందరికీ అసలు విషయం బయటపడుతుంది. మరి టీడీపీ పై విషయాల గురించి చెప్పగలదా? తద్వారా తాము ఎన్ని కోట్లు ఇచ్చి పవన్ ను కొనుక్కొన్నట్టో చెప్పగలరా?