Home రాజకీయాలు పొత్తు ఖరారైతే.. కాంగ్రెస్‌కు కొత్త కష్టం ఖాయమే!

పొత్తు ఖరారైతే.. కాంగ్రెస్‌కు కొత్త కష్టం ఖాయమే!

SHARE

ఒకవైపు తెలంగాణలో తెరాస హవాను అడ్డుకోవడానికి కాంగ్రెస్ పార్టీ పొత్తు రాజకీయాన్ని అయితే బాగానే నడిపిస్తోంది కానీ.. ఈ పొత్తు పుణ్యమా అని ఆ పార్టీ తిరుగుబాటు మాత్రం తప్పదని చెప్పవచ్చు. ఒక చోట కాదు రెండు చోట్ల కాదు.. పొత్తులో భాగంగా ఇతర పార్టీలకు కాంగ్రెస్ కేటాయించే సీట్లన్నింటిలోనూ రెబెల్స్ జెండాలు ఎగరేస్తారని వార్తలు వస్తున్నాయి.

తెలుగుదేశం పార్టీకి, తెలంగాణ జనసమితికి, కమ్యూనిస్టులకు కలిపి దాదాపు ముప్పై సీట్లను ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ సూచన ప్రాయంగా ఓకే చెప్పింది. ఆ సీట్లలో కాంగ్రెస్ పార్టీకి ఇన్నాళ్లూ ఇన్ చార్జిలు ఉండినారు. వారంతా రాజకీయ భవిష్యత్తుమీద బోలెడంత ఆశతో ఉన్న వాళ్లే. ఇప్పుడు ఉన్న ఫలంగా పొత్తు అని.. స్నేహ ధర్మం అని ఆ సీట్లను మీకు ఇవ్వమని అంటే ఆ ఆశావహులు ఊరికే ఉంటారా?

కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికిప్పుడు అలా కన్వీన్స్ చేయగల నేత ఎవరైనా ఉన్నారా? అంటే అది కూడా లేదు. ఈ నేపథ్యంలో టీడీపీ, టీజేఎస్, కమ్యూనిస్టు పార్టీలకు కాంగ్రెస్ ఇచ్చే సీట్లలో పార్టీ నుంచి తిరుగుబాటు అభ్యర్థులు తప్పరని తెలుస్తోంది.

కేవలం మిత్రపక్షాలకు ఇచ్చే సీట్లలో మాత్రమే కాదు.. పార్టీలో కూడా కొన్ని సీట్లలో ఇద్దరు ముగ్గురు ఆశావహులున్నారని… వారిలో ఒకరికి సీటిస్తే మరొకరు అలగడం, తిరుగుబాటు చేయడం కూడా ఖాయమని తెలంగాణ రాజకీయ పరిశీలకులు అంటున్నారు.