Home రాజకీయాలు రాహుల్ కథ మళ్లీ మొదటికి వచ్చింది!

రాహుల్ కథ మళ్లీ మొదటికి వచ్చింది!

SHARE

ఎలాగోలా పార్టీకి అధ్యక్షుడిగా అయితే చేసేశారు కానీ.. రాహుల్ గాంధీని ప్రధాని అభ్యర్థి అని మాత్రం అనలేకపోతున్నారు కాంగ్రెస్ వాలాలు. ఈ విషయంలో వాళ్లు చేతులు ఎత్తేసిన వైనం స్పష్టం అవుతోంది. తమ పార్టీకి అధ్యక్షుడిగా చేసుకున్నంత ఈజీగా రాహుల్ గాంధీని ప్రధానమంత్రి అభ్యర్థిని చేయలేమని కాంగ్రెస్ కు అర్థం అయ్యింది. ప్రధాని అభ్యర్థి అని రాహుల్ పేరును ప్రకటించేస్తే జనాలు ఓట్లు వేయడం సంగతలా ఉంటే… తాము మిత్రులు అనుకుంటున్న వాళ్లంతా దూరం జరుగుతారని కాంగ్రెస్ కు స్పష్టత వచ్చింది.

ఈ నేపథ్యంలో రాహుల్ తమ ప్రధానమంత్రి అభ్యర్థి కాదు.. అని ప్రకటిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నేతలు. రాహుల్ ను ప్రధాని అభ్యర్థిగా ప్రకటించే ఆలోచన ఏమీ లేదని వీరు స్పష్టం చేస్తున్నారు.

ఇది వ్యూహాత్మక ప్రకటన మాత్రమే కాదు.. ఒకరకంగా రాహుల్ విషయంలో కాంగ్రెస్ కు కూడా నమ్మకం లేనట్టే. రాహుల్ ను ప్రధాని అభ్యర్థిగా ప్రకటిస్తే.. తమతో ఇతర పార్టీలేవీ కలిసి రావని కాంగ్రెస్ కు భయం పట్టుకుంది. రాహుల్ నాయకత్వంలో పని చేయడానికి బీఎస్పీ, టీఎంసీ వంటి పార్టీలు కలిసి రావడం లేదు.

బీజేపీని ఓడించాలని ఆ పార్టీలకు ఉన్నా.. అలాగని రాహుల్ ను నెత్తిన పెట్టుకోవడానికి ఆ పార్టీలు సిద్ధంగా లేవు. అందుకే కాంగ్రెస్ పార్టీ చివరకు చేతులు ఎత్తేసింది. రాహుల్ ప్రధాని అభ్యర్థి కాదని తేల్చేసింది.

మరి ఇంతకీ రాహుల్ కాకపోతే ప్రధాని అభ్యర్థి ఎవరు? అంటే.. ఆ విషయం ఇప్పుడే తేల్చమని ఎన్నికల ఫలితాల తర్వాత మిత్రపక్షాలతో చర్చించి తేలుస్తామని కాంగ్రెస్ వాళ్లు అంటున్నారు. అయినా అంత వరకూ అయినా వస్తుందా వ్యవహారం?