Home రాజకీయాలు అదీ చంద్రబాబు నాయకత్వం అంటే..!

అదీ చంద్రబాబు నాయకత్వం అంటే..!

SHARE

మొత్తానికి గత ఎన్నికల్లో గెలిచినన్ని సీట్లను కూడా అడిగి సాధించుకోలేకపోతోంది తెలుగుదేశం పార్టీ. గత ఎన్నికల్లో సోలోగా పోటీ చేసిన సీట్లైనా తమకు కేటాయించాలని కాంగ్రెస్ ముందు గట్టిగా అడగలేకపోతోంది. స్వయంగా చంద్రబాబు నాయుడే ఈ విషయంలో చేతులు ఎత్తేశాడు. గట్టిగా డిమాండ్ చేద్దాం అని పార్టీ నేతలు కోరినా.. బాబు మాత్రం లేదు లేదు.. డిమాండ్ చేసే ప్రసక్తే లేదు.. కాంగ్రెస్ ఎన్ని ఇస్తే అన్ని తీసుకోండి చాలన్నట్టుగా తన పార్టీ నేతలను వారించినట్టుగా తెలుస్తోంది.

తెలంగాణలో తమకు నలభై నియోజకవర్గాల్లో గెలిచేంత బలం ఉందని ఆ పార్టీ నేతలు బల్లగుద్ది చెబుతుంటారు. అయితే చంద్రబాబు నాయుడు మాత్రం కాంగ్రెస్ ఇస్తానంటున్న పన్నెండు సీట్లకే చాలని అంటున్నాడు. కాంగ్రెస్ పన్నెండు ఇస్తానని అంటోందని.. వాటితో సరిపెట్టుకుందామని, ఇంతకు మించి కావాలని బెట్టు చేసి పొత్తును చెడగొట్టవద్దని తన పార్టీ నేతలకు చంద్రబాబు నాయుడు గట్టి వార్నింగ్ ఇచ్చాడని ఆ పార్టీ తెలంగాణ విభాగం నేతలే చెబుతున్నారు.

పన్నెండు సీట్ల విషయంలో హామీ వచ్చిందని.. ఇంకో ఐదారు సీట్లను అడుగుతున్నాను అని.. అయితే వాటిపై ఎలాంటి హామీ రాలేదని చంద్రబాబు నాయుడు తన పార్టీ నేతలకు చెప్పాడని సమాచారం. అసలు పన్నెండుకు మించి ఆశించవద్దు అని చంద్రబాబు నాయుడు తన వాళ్లకే స్పష్టం చేశాడట.

ఇదీ పరిస్థితి. తెలుగుదేశం పార్టీ పుట్టిందే తెలంగాణలో అంటారు. తెలంగాణ ప్రజలకు ఎన్టీఆర్ ఎన్నో నేర్పాడని చంద్రబాబు నాయుడు గొప్పగా చెబుతూ ఉంటాడు. అలాంటి తెలంగాణలో చివరకు 12 సీట్లలో పోటీ చేస్తే..చాలనే స్థాయికి తీసుకొచ్చాడు టీడీపీ రేంజ్‌ను. దటీజ్ చంద్రబాబు నాయుడి నాయకత్వం.