Home రాజకీయాలు చంద్రబాబు.. ఇలా ఏడ్చేస్తే చాలా?

చంద్రబాబు.. ఇలా ఏడ్చేస్తే చాలా?

SHARE

ప్రతి దాంట్లోనూ ఒకటే ప్రయత్నం.. ప్రతి అంశాన్ని ఒకేలా వాడుకోవడం.. తన పాలనపై ప్రబలుతున్న వ్యతిరేకతనంతా దాచేసి.. కేవలం మోడీ మీద విరుచుకుపడుతుంటే చాలానే కుటిల వ్యూహం. అన్నీ కేంద్రమే చేసింది.. తనను విమర్శిస్తున్న వాళ్లంతా బీజేపీ మనుషులే.. అంటూ ఒకే మాట. ఇదీ చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తున్న తీరు. ఈయన ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నాడో లేక ప్రతిపక్షంలో ఉన్నాడో అర్థం కావడం లేదు.

తను చేసింది ఏదైనా ఉంటే అది ప్రజలకు చెప్పుకోవచ్చు. ఈ విషయంలో చంద్రబాబుకు పాండిత్యమే ఉంది. తను చేసిన దాన్నే కాదు.. చేయని దాన్ని కూడా తనే చేశానని చెప్పుకోవడం చంద్రబాబు స్టైల్. ప్రపంచానికి ఐటీ పరిచయం చేసింది తనేనని చెప్పుకోవడం మొదలు పీవీ సింధుకు ఒలింపిక్ మెడల్ వచ్చేంత వరకూ అన్నింటికీ తనే కారణమని బాబు చెప్పుకంటూ ఉంటాడు. అలాంటి అబద్ధాలు కాదు.. ఏవైనా వాస్తవాలు ఉంటే చెప్పుకోవచ్చు.

అయితే చంద్రబాబు నాయుడు అలాంటిదేమీ చేయడం లేదు. ప్రతిదాంట్లోనూ అవతల వాళ్లను నిందించేస్తే తన పని అయిపోతుందని బాబు అనుకుంటున్నాడు. తిత్లీ తుఫాన్ ఈ విషయంలో చంద్రబాబు నాయుడుకు బాగా ఉపయోగపడుతోంది. ఇప్పటి వరకూ బాధితులను ఆదుకోవడం మాట అటుంచి, వారికి ఊరటనివ్వడం సంగతలా ఉంచి.. చంద్రబాబు నాయుడు మీ కష్టాలన్నింటికీ కేంద్ర ప్రభుత్వమే కారణం అని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు.

మోడీ కారణం.. జగన్ ఏమీ చేయలేడు, పవన్ కూడా ఏమీ చేయడం లేదు.. ఇవీ చంద్రబాబు నాయుడు మాటలు. తను చేసింది ఏమీ లేక.. ఇలా అందరినీ విమర్శిస్తూ కూర్చుంటున్నాడు. కేసీఆర్ సానుభూతి వ్యక్తం చేయలేదట… ఇదీ చంద్రబాబు నాయుడి బాధ. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి చేయాల్సింది ఇదేనా? విపత్తుల సమయంలో కూడా తన బాధ్యత మరిచి ఇలా విమర్శలు చేసుకొంటూ ఉంటాడా? ఇదేనా ముఖ్యమంత్రి పని?