Home రాజకీయాలు గెలిచే అవకాశాలున్న చోట కాంగ్రెస్‌కు కొత్త కష్టం!

గెలిచే అవకాశాలున్న చోట కాంగ్రెస్‌కు కొత్త కష్టం!

SHARE

ప్రస్తుతం జరుగుతున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రక్రియలో కాంగ్రెస్ పార్టీకి ఎక్కడైనా సానుకూల అవకాశాలు ఉన్నాయంటే అది రాజస్తాన్ లో మాత్రమే. ఈ రాష్ట్రంలో భారతీయ జనతాపార్టీని గద్దె దించి కాంగ్రెస్ అధికారం చేపట్టే అవకాశాలున్నాయని ఇది వరకూ కొన్ని సర్వేలు చెబుతున్నాయి. కాంగ్రెస్ పార్టీకి ఇంతకు మించిన ఆనందకరమైన అంశం లేదు. ఎందుకంటే.. బీజేపీని ఓడించి కాంగ్రెస్ అధికారం చేపడితే అది రేపటి ఎన్నికల ముందు కాంగ్రెస్ కు ఉత్సాహాన్ని ఇచ్చే అంశం అవుతుంది. వేరే ఏదైనా పార్టీని ఓడించి అధికారాన్ని సొంతం చేసుకోవడం వేరు.. బీజేపీని ఓడించి అధికారాన్ని సాధించుకోవడం వేరని వేరే చెప్పనక్కర్లేదు.

ఈ నేపథ్యంలో రాజస్తాన్ మీద కాంగ్రెస్ పార్టీ గంపెడాశతో ఉంది. అయితే ఇక్కడ కాంగ్రెస్ కు బీఎస్పీ రూపంలో ఝలక్ తప్పడం లేదు. ఈ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ రిజర్వడ్ స్థానాల్లో బీఎస్పీకి మంచి పట్టు ఉంది. ఇక్కడ దళిత, అణగారిన వర్గాల ఓటు బ్యాంకుకు మాయవతి గాలం వేస్తోంది. మొన్నటి వరకూ బీఎస్పీతో పొత్తుకు కూడా కాంగ్రెస్ తీవ్రంగా ప్రయత్నించింది. అయితే మాయ ముందుకు రాలేదు. ఆమె సొంతంగా తేల్చుకుంటానని అంటోంది.

ఈ నేపథ్యంలో ఆమె సోలో పోరాటానికి సిద్ధం అయ్యింది. దాదాపు యాభై అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో మాయవతి ప్రభావం చూపగలదని అంచనా. ఆమె పార్టీ నెగ్గకపోయినా.. కాంగ్రెస్ అవకాశాలను అయితే చాలా వరకూ దెబ్బ తీయగలదు. ప్రభుత్వ వ్యతిరేక ఓటును మాయ చీల్చుకోగలదు.

కాంగ్రెస్ పార్టీని ఓడిస్తామని బీఎస్పీ నేతలు స్వయంగా ప్రకటనలు చేస్తున్నారు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో అనుకూల పరిస్థితులు ఉన్నాయనే చోట మాయ రూపంలో కొత్త ప్రతిబంధకం ఎదురవుతుండటంతో కాంగ్రెస్ నేతలు తలపట్టుకుంటున్నారు.