Home రాజకీయాలు మీ టూ.. దెబ్బ, కేంద్ర మంత్రి రాజీనామా!

మీ టూ.. దెబ్బ, కేంద్ర మంత్రి రాజీనామా!

SHARE

మొత్తానికి మీ టూ దెబ్బకు ఒక పెద్ద వికెట్ పడింది. జర్నలిస్టుగా, ఎడిటర్ గా పని చేసిన రోజుల్లో తన కింది మహిళా ఉద్యోగులను వేధించాడనే ఆరోపణలను ఎదుర్కొంటున్న కేంద్ర మంత్రి ఎంజే అక్బర్ రాజీనామా చేశాడు. ఈ వ్యవహారంలో కొంత వరకూ ఎదురుదాడి చేసేందుకు అక్బర్ ప్రయత్నించగా.. ఇప్పుడు అదంతగా సాధ్యం కాలేదు. దీంతో అక్బర్ రాజీనామా చేశాడు.

ఈ కేంద్ర మంత్రి రాజీనామా విషయాన్ని ఒక ప్రముఖ వార్తా సంస్థ ట్వీట్ చేసింది. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అక్బర్ పై అనేక మంది మహిళా జర్నలిస్టులు ఆరోపణలు చేశారు. ఆయన తమను లైంగికంగా వేధించారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అవన్నీ ఇప్పటి వ్యవహారాలు కావు.. అక్బర్ జర్నలిస్టుగా ఉద్యోగాలు చేసుకున్న రోజులు.

ఆ సమయంలో ఈయన తమతో అనుచితంగా ప్రవర్తించాడని వారంతా మూకుమ్మడిగా ఆరోపించారు. అయితే అక్బర్ వారిపై ఎదురుదాడి చేశాడు. అందుకు రుజువుల్లేవు అన్నట్టుగా మాట్లాడాడు. ఇక అక్బర్ వ్యవహారంతో మోడీ సర్కారుకూడా విమర్శల పాలయ్యే పరిస్థితి వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంపై స్పందించేందుకు సుష్మా స్వరాజ్ వంటి వాళ్లు కూడా నిరాకరించారు. కానీ.. చివరికేమో అక్బర్ రాజీనామా తప్పలేదు.