Home రాజకీయాలు రాజకీయాల్లో భలే నటించేస్తున్న పవన్, చిరు!

రాజకీయాల్లో భలే నటించేస్తున్న పవన్, చిరు!

SHARE

ముందుగా ఒక పార్టీని పెట్టారు. ఎన్టీఆర్ లా చిరంజీవి కూడా ముఖ్యమంత్రిని అయిపోదామని కలలు కన్నాడు. అయితే ఎన్టీఆర్ నాటి పరిస్థితులకూ చిరు నాటి పరిస్థితులకు తేడా ఉంది స్పష్టం. దీంతో చిరుకు ఎదురుదెబ్బ తగిలింది. మరి నిజంగా ప్రజా సేవ కోసమే వచ్చి ఉంటే ఆ పార్టీని అలాగే ఉంచాల్సింది. అంత ఓపిక లేకపోయింది. చాలా తొందరగానే జెండా పీకేశారు. డెబ్బై లక్షల ఓటర్లకు పంగనామం పెట్టి ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లోకి విలీనం చేశాడు మెగాస్టార్.

అందుకు ప్రతిఫలంగా రాజ్యసభ సభ్యత్వాన్ని, కేంద్రమంత్రి పదవిని కూడా పొందాడు. పరమ అవకాశవాది అనిపించుకున్నాడు. కట్ చేస్తే.. మళ్లీ ఎన్నికలు వచ్చేశాయి. కాంగ్రెస్ పార్టీ ప్రభ కోల్పోయింది. చిరు కథ అయిపోయింది. మళ్లీ కొత్త పార్టీ. అప్పటికే జనాలు నవ్వుకున్నారు. ఏమిటీ కామెడీ అనుకున్నారు. ఎన్నాళ్లు మోసం చేస్తారు? అని చర్చించుకున్నారు. అయితే తన పార్టీతో అన్నకు సంబంధం లేదని పవన్ కల్యాణ్ కోతలు కోశాడు.

అన్న పోస్ట్ పెయిడ్ అయితే తమ్ముడు ప్రీ పెయిడ్ లా వ్యవహరించాడు. గత ఎన్నికల ముందు బీజేపీ, టీడీపీలకు ప్రచారం చేసి పెట్టాడు. ఇక ఇప్పుడేమో సొంతంగా సత్తా చూపిస్తా అంటున్నాడు. ఇక మొన్నటి వరకూ తన పార్టీకీ అన్నకు సంబంధం లేదని చెప్పుకొచ్చాడు. ఇప్పుడేమో అన్న అభిమానులే తన పార్టీకి ఆయువు పట్టు అంటున్నాడు.

ఇక ఇదే అదునుగా అన్న కూడా కొత్త రాజకీయం మొదలుపెట్టాడు. తనకూ కాంగ్రెస్ పార్టీకీ ఇక సంబంధం లేదనే లీకును ఇచ్చాడు. రాజీనామా చేశానని ప్రకటిస్తే తీవ్రమైన విమర్శలు వస్తాయని భయపడి.. చిరంజీవి వ్యూహాత్మక లీకును ఇచ్చాడు. తద్వారా తన తమ్ముడి పార్టీకి పరోక్షంగా సహకారం అందించే ప్రయత్నం చేస్తున్నాడు. మొత్తానికి సామాన్య జనం అనుకుంటున్నది ఏమిటంటే.. పవన్ కల్యాణ్, చిరంజీవిలు రాజకీయాల్లో భలే నటించేస్తున్నారే అని!