Home రాజకీయాలు టీడీపీకి పవన్ భయం తీవ్ర స్థాయికి..?

టీడీపీకి పవన్ భయం తీవ్ర స్థాయికి..?

SHARE

మొత్తానికి పవన్ కల్యాణ్ పై తెలుగుదేశం పార్టీ తీవ్ర స్థాయిలో స్పందించక తప్పడం లేదు. ఒకవైపు పవన్ కల్యాణ్ ను చంద్రబాబు నాయుడే రంగంలోకి దించాడనే ప్రచారం ఉంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు మూకుమ్మడిగా జగన్ కు పడకుండా దాన్ని వేరు చేసేందుకే పవన్ ను చంద్రబాబు నాయుడు రంగంలోకి దించాడనే అభిప్రాయాలున్నాయి. దానికి అనుగుణంగా బాబుకు, పవన్‌కు మొన్నటి వరకూ సత్సంబంధాలు నెరవడం, ఇప్పుడు కూడా పవన్ వీర సన్నిహితుల్లో చంద్రబాబు మనుషులు కనిపిస్తూ ఉంది.

మరి పవన్ రాజకీయం అంతా చంద్రబాబు నాయుడి గేమ్ అనేందుకు ఇంకా గట్టి ఆధారాలేవీ కనిపించడం లేదు. అసలు కథ ముందు ముందు తెలుస్తుంది. అదలా ఉంటే.. పైకి మాత్రం తెలుగుదేశం పార్టీ వాళ్లు పవన్ పై విరుచుకుపడుతున్నారు. వీళ్ల మాటలు వింటుంటే వీళ్లలో పవన్ దెబ్బ కొడతాడని కూడా స్పష్టం అవుతోంది.

ఒకటైతే వాస్తవం.. గత ఎన్నికల సమయంలో పవన్ కల్యాణ్ తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేయడం వల్ల దానికి చాలా లబ్ధి కలిగింది. కొద్దో గొప్పో ఓట్లు కలిసి వచ్చాయి. అప్పుడు టీడీపీకి వచ్చిన మెజారిటీ కూడా ఏమంత పెద్దగా లేదు. వైసీపీ కన్నా ఐదున్నర లక్షల ఓట్లను మాత్రమే అధికంగా సంపాదించుకుంది టీడీపీ. ఇలాంటి నేపథ్యంలో రేపు పవన్ సపోర్ట్ టీడీపీకి లేకపోతే పవన్ సొంత కుంపటి పెట్టుకుంటే.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలడం సంగతెలా ఉన్నా… గత ఎన్నికల్లో పవన్ వల్ల టీడీపీ పడ్డ ఓట్లు మాత్రం వచ్చేసారి పడవు.

ఇది స్పష్టం అవుతున్న విషయం. ఈ విషయమే టీడీపీ నేతల మాటల్లో బయటపడుతూ ఉంది. మంత్రి యనమల మాట్లాడుతూ.. ‘ఎవరిని గెలిపించడానికి రేపటి ఎన్నికల్లో పవన్ పోటీ చేయాలని అనుకుంటున్నాడు?’ అని ప్రశ్నించాడు. దీన్ని బట్టి పవన్ పార్టీ పోటీతో తమకు ఎదురుదెబ్బే అని టీడీపీ నేతలే చెప్పుకుంటున్నట్టుగా ఉంది.