Home రాజకీయాలు కాంగ్రెస్‌కు దూరం..ఇక చిరు దారి అటే..?

కాంగ్రెస్‌కు దూరం..ఇక చిరు దారి అటే..?

SHARE

కాంగ్రెస్ పార్టీతో చిరంజీవి బంధానికి శుభం కార్డు పడిందని తెలుస్తోంది. చిరంజీవి కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి సమయం ముగిసిందని, చిరు తన సభ్యత్వ నమోదు మళ్లీ చేయించుకోలేదని.. కాంగ్రెస్ సభ్యత్వ కాలాన్ని పొడిగించుకోలేదని వార్తలు వస్తున్నాయి. ఈ విధంగా చిరంజీవికి కాంగ్రెస్‌తో బంధం ముగిసిందని ప్రచారం జరుగుతూ ఉంది. అయితే ఈ విషయంపై చిరంజీవి స్పందించలేదు.

చిరంజీవి కాంగ్రెస్ పార్టీ నేత ఎలా అయ్యాడో అందరికీ తెలిసిందే. ప్రజారాజ్యం పార్టీని విలీనం చేసి కాంగ్రెస్ పార్టీ నుంచి లబ్ధి పొందాడు చిరు. ఆరేళ్ల రాజ్యసభ సభ్యత్వ కాలాన్ని, కేంద్ర మంత్రి పదవిని పొందాడు. ఇక కాంగ్రెస్ చేతి నుంచి అధికారం చేజారగానే చిరు కామ్ అయిపోయాడు. రాజ్యసభ సభ్యుడిగా ఉన్నా సభకు సరిగా వెళ్లలేదు.

కాంగ్రెస్ లోనే ఉన్నా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో మాత్రం పాల్గొనలేదు. పార్టీ నేతలు అనేక ప్రోగ్రామ్స్ చేపడుతున్నా చిరు మాత్రం వాటి జోలికి వెళ్లలేదు. ఏదో కాంగ్రెస్ లో ఉన్నానంటే ఉన్నాను అన్నట్టుగా వ్యవహరించాడు చిరు. ఇక ఇప్పుడు సభ్యత్వ కాలం కూడా ముగిసిందని అంటున్నారు.

ఇక నెక్ట్స్ ఏమిటి? అనేది ప్రశ్న. ప్రస్తుతానికి అయితే మెగాస్టార్ సినిమాలతో బిజీగా ఉన్నాడు. హీరోగా తన స్టార్ డమ్ ను ఎంజాయ్ చేస్తున్నట్టుగా కనిపిస్తున్నాడు. కాబట్టి ఇక సినిమాలకే పరిమితం కావొచ్చు. పవన్ కల్యాణ్ పార్టీ వైపు కూడా చిరు చూడకపోవచ్చు. చూస్తే మరింత విమర్శలు తప్పవు!