Home రాజకీయాలు కాంగ్రెస్ పార్టీ దివాళాకోరుతనం పతాక స్థాయికి!

కాంగ్రెస్ పార్టీ దివాళాకోరుతనం పతాక స్థాయికి!

SHARE

తెలుగుదేశం నేతల తరఫున కాంగ్రెస్ నేతలు వకాల్తా పుచ్చుకుని మాట్లాడుతుండటం ఆ పార్టీ అభిమానులను బాధ పెడుతూ ఉంది. దశాబ్దాల కథనంతా పక్కన పెట్టేసి ఇప్పుడు టీడీపీ , కాంగ్రెస్ లు అవకాశవాదం కొద్దీ చేతులు కలిపాయి. అయితే గత మూడున్నర దశాబ్దాల్లో కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీలు తెలుగునాట రాజకీయాన్ని నడిపించి అనేక మందిని శత్రువులుగా మార్చాయి.

తెలుగు వాళ్లు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడంతా కాంగ్రెస్, తెలుగుదేశం అంటే బద్ధ శత్రువర్గాలుగా నిలిచాయి. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల సానుభూతి పరులు శత్రువులుగా మారి కొట్టుకున్న సందర్భాలు, హత్యలు చేసుకున్న సంఘటనలు కోకొల్లలు. తెలుగు రాజకీయ చరిత్ర అంతా ఇలానే ఉంటుంది. కాంగ్రెస్, తెలుగుదేశం అనేవి ఒక కులం, ఒక మతంలా మారిపోయి జనాల మధ్యన తేడాను తీసుకొచ్చాయి. ఇలా దశాబ్దాల కాలంలో రెండు పార్టీల మధ్యన ఇంత వైరం ఉంది. అయితే ఇప్పుడు ఇరు పార్టీల నేతలూ తమ అవకాశవాదం కొద్దీ చేతులైతే కలిపేశారు కానీ.. జనాల మధ్యన మాత్రం ఆ వైరం అలాగే మిగిలిపోయింది.

ఇప్పుడు కాంగ్రెస్ నేతలు ఎంత నీఛానికి దిగజారిపోయారంటే.. ఆఖరికి టీడీపీ నేతల ఇళ్లపై ఐటీ దాడులు జరిగినా వీళ్లు సహించలేకపోతున్నారు. ఆ ఐటీ రైడ్స్ తమ ఇళ్లపై జరిగినట్టుగా వీళ్లు ఫీలవుతున్నారు. ఈ విషయంలో వీళ్లు మీడియాకు ఎక్కి తమ అసహనాన్ని చాటుతున్నారు. తెలుగుదేశం పార్టీ నేతల ఇళ్లపై ఐటీ రైడ్స్ తీవ్రమైన తప్పిదాలు అన్నట్టుగా వీరు మాట్లాడుతూ ఉన్నారు.

అయితే ఇదే కాంగ్రెస్ నేతలు గతంలో తమ పార్టీ నేతల పరువును తీసుకున్నారు. సీబీఐ, ఐటీ రైడ్స్ అంటూ.. తమ వాళ్లనే ఇబ్బంది పెట్టారు. ఎవరి పేరు చెప్పుకుని తాము అధికారాన్ని సంపాదించుకున్నామో వాళ్ల మీదే సీబీఐని ప్రయోగించిన ఘనత కాంగ్రెస్ పార్టీది. అసలుకు సీబీఐని ఇలా రాజకీయ కక్ష సాధింపులకు వాడుకోవచ్చని గనుకొన్నదే కాంగ్రెస్ వాళ్లు. ఇలాంటి పార్టీ వాళ్లు ఇప్పుడు.. రాజకీయ కక్ష సాధింపులు అంటూ తెలుగుదేశం పార్టీ వాళ్లపై సానుభూతి వ్యక్తం చేయడం ఆ పార్టీకి ఇంకా మిగిలిన అభిమానులు ఎవరైనా ఉంటే వారిని అసహనభరితులుగా మారుస్తోంది.