Home రాజకీయాలు “బాబుకి సీఎం రమేష్ నెంబర్ వన్ బినామీ”

“బాబుకి సీఎం రమేష్ నెంబర్ వన్ బినామీ”

SHARE

తెలుగుదేశం నేత పార్లమెంటు సభ్యుడు సీఎం రమేష్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కు నంబర్ వన్ బినామీ అని వైకాపా రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు పేర్కొన్నారు. రమేశ్ పై ఐటీ దాడులు జరిగితే టీడీపీ నేతలకి ఉలికిపాటు ఎందుకు అని అంబటి ప్రశ్నించారు.

అసలు ఐటీ దాడుల వెనుక ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ఉన్నాడని రమేశ్ ఆరోపించడం ఏమిటని అంబటి మండిపడ్డారు. జగన్ ను విమర్శించే నైతిక అర్హత కూడా సీఎం రమేష్ కు లేదని ఆయన అన్నారు. విజయవాడ లోని వైకాపా కార్యాలయంలో ఈ రోజు నిర్వహించిన మీడియా సమావేశం లో అంబటి మాట్లాడారు.

ఒక పక్క తనిఖీ లపై సీఎం రమేశ్ మీసాలు మెలేసి సవాలు చేస్తుంటే ఐటీ అధికారులు అంతే ఆనందంగా తొడలు చరుస్తున్నారని అంబటి ఎద్దేవా చేశారు. రిత్విక్ కంపెనీ ఏనాడూ భారీ కాంట్రాక్టు లను తీసుకోలేదని ఆయన స్పష్టం చేశారు. ఆ సంస్థ ఇప్పటివరకూ అన్నీ సబ్ కాంట్రాక్టులే చేసిందనీ, అలా సబ్ కాంట్రాక్టులు కూడా బెదిరించి చేపట్టినవే అని వెల్లడించారు.

సీఎం రమేశ్ ఓ గజదొంగ, బినామీ, కాబట్టే…..ఇంట్లో కూడా హైటెక్ లాకర్లు పెట్టుకున్నారని విమర్శించారు. ఇంట్లో ఉన్న లాకర్లు సీఎం రమేశ్ వేలిముద్రతో మాత్రమే తెరుచుకుంటాయన్న విషయం కుటుంబ సభ్యులకు కూడా తెలియకపోవడం ఆశ్చర్యం అని అంబటి పేర్కొన్నారు. అసలు ఆ లాకర్ల లో ఏమున్నాయని ప్రశ్నించారు. ఒక సారా కాంట్రాక్టర్‌ నుంచి పార్లమెంటు సభ్యుడి స్థాయికి రావడానికి సీఎం రమేష్ గెస్ట్‌హౌస్ రాజకీయాలే కారణమన్నారు. ప్రజలు బుద్ది చెప్పే రోజులు ముందున్నాయని అంబటి అన్నారు.