Home రాజకీయాలు బాబు ప్రకటించిన అభ్యర్థిపై నేతల ఫైర్!

బాబు ప్రకటించిన అభ్యర్థిపై నేతల ఫైర్!

SHARE

చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం విషయంలో అభ్యర్థి ప్రకటనపై చంద్రబాబు నాయుడు చాలా కసరత్తే చేశాడు. ఇటీవలే గాలి ముద్దుక్రిష్ణమనాయుడు మరణించడంతో అక్కడ వేరే అభ్యర్థిని ప్రకటించుకోవడం అనివార్యం అయ్యింది. ఈ నేపథ్యంలో గాలి కుటుంబంలో విబేధాల పరిష్కరానికే చాలా టైమ్ పట్టింది. గాలి తనయులిద్దరూ అభ్యర్థిత్వం విషయంలో విబేధించుకున్నారు. సీటు విషయంలో పోటీ పడ్డారు. అయితే వారిలో వాళ్లే తేల్చుకోవాలని.. తేల్చుకుని తన వద్దకు రావాలని చంద్రబాబు నాయుడు ఆదేశించాడు.

ఈ మేరకు వాళ్లు తేల్చుకోవడంతో గాలి భాను ను అభ్యర్థిగా ప్రకటించాడు చంద్రబాబు నాయుడు. ఇలాంటి నేపథ్యంలో నియోజకవర్గం నుంచినే అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ఎన్నాళ్లు ఇలా ఒకే కుటుంబానికి ప్రాధాన్యతను ఇస్తారు? అని కొంతమంది స్థానిక టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంలో వారు ఫైర్ అవుతున్నారు.

అక్కడ ప్రధానంగా మూడు వర్గాల నుంచి అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ఒకటి క్షత్రియ సామాజికవర్గం. ఇక్కడ గతంలో వీళ్లు టీడీపీకి అండగా నిలిచారు. ఈ సామాజికవర్గం వాళ్లే టీడీపీ తరఫు నుంచి పోటీ చేసి గెలిచిన చరిత్ర కూడా ఉంది. మరోవైపు బీసీలు.. వీళ్లు కూడా తమకు ప్రాతినిధ్యం కల్పించమని కోరుతున్నారు. ఎన్నాళ్లు కమ్మ అభ్యర్థికే పట్టం అని ప్రశ్నిస్తున్నారు.

మరోవైపు కమ్మ వాళ్లలో కూడా కొందరు గాలి కుటుంబ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఎంతసేపూ గాలి కుటుంబానికేనా? అని వీళ్లు ప్రశ్నిస్తున్నారు. ఈ పంచాయితీ త్వరలోనే అమరావతికి చేరనుందని తెలుస్తోంది. మొత్తానికి ఏదో ఒకలా బాబు అభ్యర్థిని ప్రకటించాడనుకుంటే… ఇప్పుడు అక్కడ కొత్త రచ్చ మొదలైనట్టుగా ఉంది.