Home ప్రత్యేకం మాట మార్చడం గురించి బాబు లెక్చరిచ్చాడు!

మాట మార్చడం గురించి బాబు లెక్చరిచ్చాడు!

SHARE

ఇదీ కామెడీ అంటే. మాట మార్చడం గురించి చంద్రబాబు నాయుడు లెక్చరిచ్చాడు. కేంద్ర ప్రభుత్వం మాట మారుస్తోందని.. సమాయనుకూలంగా మాట్లాడుతోందని చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తాడు. కేంద్ర ఆర్థిక సంఘం సమావేశంలో చంద్రబాబు నాయుడు ఇలా మాట్లాడాడు. కేంద్ర ప్రభుత్వం సమాయనుకూలంగా వ్యవహరిస్తోందని చంద్రబాబు నాయుడు అనడమే అక్కడ పెద్ద కామెడీ. విభజన హామీలను నెరవేర్చలేదని.. ప్రత్యేకహోదా ఇవ్వడం లేదని మోడీ ప్రభుత్వాన్ని నిందిస్తూ చంద్రబాబు నాయుడు ఇలా మాట్లాడాడు.

అయినా ఇలా మాట్లాడగలగడం, ఇలా మాట్లాడితే జనాలు నవ్వుతారని భయపడకపోవడం చంద్రబాబు నాయుడుకే సాధ్యం అవుతుంది కాబోలు. ఇంత నిస్సిగ్గుగా వ్యవహరించడం చంద్రబాబు కే సాధ్యం అవుతుంది.

ప్రత్యేకహోదా విషయంలో కేంద్ర ప్రభుత్వం మాట మార్చింది నిజమే. ఇది ఎవరూ కాదనడం లేదు. ఆ సమయంలో చంద్రబాబు నాయుడు వేసిన పిల్లిమొగ్గల మాటేమిటి? కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకహోదా విషయంలో మాట తప్పినప్పుడు చంద్రబాబు నాయుడు ఏమన్నాడు? కేంద్రంతో వంత పాడలేదా? ప్రత్యేకహోదా అవసరం లేదు అని తేల్చేయలేదా? ప్రత్యేకహోదాతో ఏమొస్తుంది? అని ప్రశ్నించలేదా. హోదా కావాలన్న జగన్ కు ఏమీ తెలియదని అనలేదా. హోదాతో ఏమీ రాదు.. ప్యాకేజీతోనే అంతా వస్తుంది.. ప్యాకేజే మేలు అని అనలేదా? ఈ మాటలకు సంబంధించిన వీడియో ఆధారాలు కూడా అలానే ఉన్నాయి.

అప్పుడేమో హోదా వద్దు.. ప్యాకేజీ చాలు.. ప్యాకేజీ ఇచ్చినందుకు మోడీ ధన్యవాదాలు.. అంటూ అసెంబ్లీలో తీర్మానం చేసి, నాలుగేళ్లు అలా బీజేపీతో అంటకాగి.. ఇప్పుడు మోడీ మోసం చేశాడు, సమాయానుకూలంగా మాట్లాడాడు అని చంద్రబాబు నాయుడు అంటున్నాడు. సమాయానుకూలంగా మాట్లాడింది ఎవరు? అనే అంశం ప్రజలకు తెలియడం లేదు అనే భ్రమలో బతుకుతున్నట్టుగా ఉన్నాడు చంద్రబాబు నాయుడు.