Home రాజకీయాలు జాతీయ మీడియా సర్వేలు: తెలంగాణలో గెలిచేదెవరంటే!

జాతీయ మీడియా సర్వేలు: తెలంగాణలో గెలిచేదెవరంటే!

SHARE

షెడ్యూల్ వచ్చేసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై అధ్యయనాలు కొనసాగిస్తూ ఉన్నాయి జాతీయ మీడియా వర్గాలు. ఏ రాష్ట్రంలో ఎవరికి విజయావకాశాలున్నాయనే అంశం గురించి ఈ అధ్యయనాలు సాగుతూ ఉన్నాయి. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల విషయంలో వివిధ అధ్యయన సంస్థలు తమ అంచనాలను వెల్లడించాయి. ఇక తాజాగా తెలంగాణ విషయంలో కూడా మీడియా వర్గాలు, సర్వే సంస్థలు తమ అంచనాలను వ్యక్తం చేశాయి.

వీటి ప్రకారం తెలంగాణలో కారు స్పీడు గట్టిగానే ఉంది. సర్వేలన్నీ తెరాసకే పట్టం కట్టడం ఒక విశేషం అయితే, తెరాస గత ఎన్నికల కన్నా గట్టి స్థాయిలో సీట్లను గెలుచుకుంటుందని ఈ అధ్యయనాలు స్పష్టం చేస్తుండటం మరో విశేషం.

సీ ఓటర్, టైమ్స్ నౌ, ఫ్లాష్ టీమ్.. తదితర సర్వేలన్నీ ఒకే మాటే చెబుతున్నాయి. తెరాసదే తెలంగాణలో పై చేయి అని ఈ సర్వేలు అంటున్నాయి. వీటన్నింటి సగటును చూస్తే.. తెలంగాణలో తెరాస ఎనభై సీట్లను నెగ్గే అవకాశం ఉంది. తమకు వంద సీట్లు వస్తాయని తెరాస అధినేత కేసీఆర్ తరచూ ప్రకటించుకుంటున్నారు. అంత స్థాయిలో కాకపోయినా.. 80కి పైగా సీట్లు గ్యారెంటీ అని ఈ సర్వేలు చెబుతున్నాయి.

ఎనభై సీట్లు సాధించుకున్నా అది తెరాసకు గట్టి విజయమే అవుతుంది. ఎందుకంటే.. గత ఎన్నికల్లో ఈ పార్టీకి వచ్చింది 63 సీట్లు మాత్రమే. ఈ సారి మరో 17 సీట్లు పెరిగితే అంత కన్నా గొప్పే ముంది? అయితే ఈ సర్వేలు మహాకూటమి ఏర్పడకముందువి అనుకోవాలి. తెలంగాణలో కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, కమ్యూనిస్టులు కలిసి బరిలోకి దిగితే పరిస్థితి కొంచెం తేడా ఉండవచ్చునేమో!