పవన్.. కొండంత రాగం తీసి..ఇప్పుడిలా!

SHARE

పెద్ద పెద్ద మాటలు చెప్పడం.. తీరా సమయం వచ్చినప్పుడు చేతులు ఎత్తేయడం ఇదీ పవన్ కల్యాణ్ తీరు. జనసేన పార్టీ పెట్టి.. ఏవేవో డైలాగులు చెప్పాడు. తీరా ఎన్నికల్లో తెలుగుదేశం, బీజేపీలకు మద్దతుగా రోడ్లు పట్టుకుని తిరిగాడు. ఇక ఎన్నికలు కాగానే పార్టీ నిర్మాణం అన్నాడు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనే పోటీ చేసేస్తానని అన్నాడు. అయితే అంత సీన్ లేకపోయింది. ఇక నాలుగేళ్లు గడిచిపోయాయి..ఈ నాలుగేళ్లలో పవన్ విరామాల్లో రాజకీయాలు చేస్తూ వస్తున్నాడు. కొన్నాళ్లు తెదేపా భజన మళ్లీ ఇప్పుడు సొంత కుంపటి ఇదీ కథ.

ఇక తన ప్రత్యక్ష పోటీ విషయంలో పవన్ ఇప్పటి వరకూ చాలా కథలు చెప్పాడు. అనంతపురం నుంచి అన్నాడు.. ఏలూరు నుంచి ప్రయత్నాలు అన్నాడు.. ఆఖరికి ఒక ఎస్టీ నియోజకవర్గం నుంచి కూడా పోటీ అనేశాడు. ఇలా నోటికొచ్చినట్టుగా చెబుతూ పోతున్నాడు. ఇక తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల విషయంలో అయితే పవన్ మాటలకు కొదవే లేదు.

తెలంగాణ అసెంబ్లీ రద్దు అయిన దగ్గర నుంచినే కాదు అంతకు ముందు కూడా ఈ రాష్ట్రంలో తన పార్టీ పోటీలో ఉంటుందన్నట్టుగా పవన్ కల్యాణ్ ప్రకటించుకొంటూ వచ్చాడు. ఈ విషయంలో సీపీఎంకు ఆశలు కూడా పెట్టాడు. ఆ పార్టీ పవన్ మీద ఆశలు పెట్టుకుని మహాకూటమిలో కూడా చేరకుండా ఆగిపోయింది. ఇప్పుడేమో పవన్ పోటీ పై చేతులు ఎత్తేసినట్టే అని తెలుస్తోంది. తెలంగాణలో ఎన్నికల పోటీకి దూరం అనే విషయాన్ని మరో నాలుగైదు రోజుల్లో జనసేన అధికారికంగా ప్రకటించనుందని తెలుస్తోంది.

కనీసం ఎన్నికల్లో పోటీ చేద్దామంటే గుర్తు కావాలి. జనసేనకు ఇంకా అదే లేదు. ఇక అభ్యర్థులు.. నేతలు, కార్యకర్తలు..ఇలా ఒక నిర్మాణం అంటూ లేదు. ఇదీ పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో తెలంగాణలో ఎన్నికల విషయంలో జనసేన అధినేత మొదట్లో రాగం తీసి.. ఇప్పుడు మాత్రం సమయాభవం వల్ల తప్పుకుంటున్నట్టుగా ప్రకటన చేయనున్నాడు. ఇదీ కథ.